గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 9 మే 2022 (21:54 IST)

హృదయ సంబంధ వ్యాధుల విషయంలో అవగాహనే కీలకం: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

governor
హృదయ సంబంధ వ్యాధుల విషయంలో ప్రజానీకానికి మరింత అవగాహన తీసుకు వచ్చేందుకు వైద్యులు తమ వంతు భూమికను పోషించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపు నిచ్చారు. వ్యాధుల నివారణకు సంబంధించిన ఉత్తమమైన మార్గాలను అన్వేహించాలన్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన వరుణ్ కార్డియాక్ సైన్సెస్ ను ఆదివారం గవర్నర్ ప్రారంభించారు.

 
ఈ సందర్భంగా బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ గుండెపోటు సంభవించకుండా నిరోధించడంపై దృష్టి సారించాలని, ఆధునిక వైద్య సేవలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడం అత్యావశ్యకమని వివరించారు. రైతు కుటుంబం నుండి వచ్చిన డాక్టర్ గుంటూరు వరుణ్, 2017లో కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించి, మే 2019 నుండి సురక్షితమైన, మినిమల్ యాక్సెస్ కార్డియోథొరాసిక్ ప్రక్రియతో విజయవంతమైన కార్డియోథొరాసిక్ సర్జన్‌గా అభినందనీయమన్నారు.

 
 దక్షిణ భారతదేశంలో 100కు పైబడి 'కీ-హోల్ మినిమల్లీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ'లను విజయవంతంగా నిర్వహించిన రికార్డును సైతం డాక్టర్ వరుణ్ కలిగి ఉండటం అతని ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా ముఫై ఒక్క శాతం మరణాలు కార్డియోవాస్కులర్ డిసీజ్ కారణంగా సంభవిస్తున్నాయని, ప్రపంచీకరణ, పట్టణీకరణ వల్ల హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం మరింత పెరిగిందన్నారు.

 
రాష్ట్రంలో గుండెపోటు యొక్క సగటు వయస్సు 49 సంవత్సరాలుగా ఉండటం ఆందోళనకరమన్నారు. కేంద్ర ప్రభుత్వ ‘ఆయుష్మాన్ భారత్’, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకాలు ఆధునిక వైద్య సదుపాయాలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకు వచ్చి పేద ప్రజలకు సహాయం చేస్తున్నాయన్నారు. ఆరోగ్యశ్రీ పథకం దారిద్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు అధునాతన వైద్యం అందించి, వారికి ఆర్థిక రక్షణ కల్పించడం ముదావహన్నారు. ఆరోగ్యశ్రీ పథకం 30 విభాగాలలో 2434 రకాల శస్త్రచికిత్సలను అందిస్తుందని గవర్నర్ పేర్కొన్నారు.

 
 డాక్టర్ వరుణ్ కార్డియాక్ సైన్సెస్ నాణ్యమైన వైద్య సంరక్షణను అందించడానికి అవసరమైన అత్యాధునిక మౌలిక సదుపాయాలను కలిగి ఉండటం శుభపరిణామమన్నారు. డాక్టర్ వరుణ్ మాట్లాడుతూ, తమ సంస్ధ ద్వారా సమాజంలోని పేద, అణగారిన వర్గాలకు అత్యాధునిక వైద్యాన్ని అందుబాటులోకి తీసుకు వస్తానన్నారు.