శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , గురువారం, 30 డిశెంబరు 2021 (15:25 IST)

కల్లు మత్తు పానీయం కాదు... ఔషధం అన్న డైరెక్ట‌ర్ బోయ‌పాటికి స‌న్మానం

గీత కార్మికులను గౌరవిస్తూ, కల్లు అనేది మత్తుపానీయం కాద‌ని, అది ఒక ఔష‌ధం అని యావత్తు భారత దేశానికి ఒక మంచి సందేశం ఇచ్చిన ఆఖండ దర్శకుడు బోయపాటి శ్రీనుకి కృష్ణా జిల్లా గౌడ సంఘం స‌న్మానించింది. గౌఢ సంఘం అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి, రాష్ట్ర గౌడ యువత నాయకుడు ఈడే మురళీకృష్ణ పెదకాకానిలోని ఆయన ఇంటి వద్ద కలిసి  కృతజ్ఞతలు తెలియ చేశారు. 
 
 
పెదకాకానిలోని బోయపాటి ఇంటి వద్ద కలసిన గౌడ సంఘ నాయకులు గౌడ సంఘం తరఫున దుశ్శాలువతో సత్కరించి మెమెంటో అందజేశారు. గౌడ సంఘ నాయకుడు గురుమూర్తి మాట్లాడుతూ,  టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఉండగా కల్లు మత్తు పానీయం అని, కల్లును నిషేధించాలని నిర్ణయం తీసుకోగా, ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న సర్దార్ గౌతు లచ్చన్న  గౌరవ ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు వద్దకు వెళ్లి కల్లు మత్తుపానీయం కాదని అనేక ఔషధ గుణాలు ఉన్నాయని వివ‌రించార‌ని చెప్పారు. మరీ ముఖ్యంగా గౌఢ‌ జాతికి ఆధారమైన వృత్తిని నిషేధించడం  వలన యావత్ గౌడ జాతి రోడ్డున పడే పరిస్థితి వస్తుందని ప్రకాశం పంతులుకి చెప్పినప్పటికీ ఆయన అంగీకరించకపోవడంతో,  గౌతు లచ్చన్న అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టార‌న్నారు. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా అధికార పార్టీ మీద ప్రతిపక్ష నేత పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గిన చరిత్ర  సర్దార్ గౌతు లచ్చన్నదని అన్నారు. మరల ఇపుడు అఖండ సినిమా ద్వారా మరొకసారి యావత్ ప్రపంచానికి కల్లును గురించి వెండితెరపై చక్కని సందేశాన్నిచ్చిన బోయపాటికి గౌడ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.  
 
 
ఈ సందర్భంగా ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ, త‌న‌కు మొదటి నుంచి గౌడ  కుటుంబాలతో గ్రామంలో మంచి అనుబంధం ఉందని, తెలంగాణలో కూడా మంచి స్నేహితులు ఉన్నారని చెప్పారు. ఆ మమకారంతోనే అఖండ సినిమాలో కల్లును తెరకెక్కించాన‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు  పామర్తి కిషోర్ బాబు, మురారి వాసు, లుక్కా అరుణ్ కుమార్, యారగాని సాయిబాబు తదితర గౌడ సంఘ నాయకులు పాల్గొన్నారు.