శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 ఆగస్టు 2023 (10:10 IST)

జనసైనికులు సమర్పించు.. 'సందులో సంబరాల శ్యామ్‌బాబు' సినిమా ప్రారంభం

sandulo shyambabu
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై సినిమా తీయనున్నట్టు ఏపీ మంత్రి అంబటి రాంబాబు ప్రకటించారు. ఇలా ప్రకటించిన 24 గంటలు తిరగకముందే జనసైనికులు అంబటి రాంబాబు జీవిత చరిత్రపై ఓ సినిమాను ప్రారంభించారు. జనసైనికులు సమర్పణలో "సందులో సంబరాల శ్యాంబాబు" అనే టైటిల్‌తో వారు ఓ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలను బుధవారం తిరుపతిలో ప్రారంభించారు. 
 
తమ అభిమాన నేత, హీరో పవన్‌ కల్యాణ్‌ నటించిన "బ్రో" సినిమాపై మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలను ఖండిస్తూ తిరుపతి జనసేన నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. ముందుగా మంత్రి అంబటి రాంబాబు వేషధారణ కలిగిన వ్యక్తి ఆధ్వర్యంలో స్వామివారికి పూజలు నిర్వహించి క్లాప్‌ కొట్టి సినిమా ప్రారంభించారు. 
 
ఆ వ్యక్తిని గొబ్బెమ్మలా కింద కూర్చోబెట్టి వీరమహిళలు చేతులకు గాజులు వేసి నృత్యం చేస్తూ పూలు చల్లారు. కార్యక్రమంలో జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కిరణ్‌ రాయల్‌, జనసేన పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, నాయకులు సుభాషిణి, కీర్తన, అరుణ, శేషారత్నం పాల్గొన్నారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
దీనిపై కిరణ్ రాయల్ మాట్లాడుతూ, తమ చిత్రంలో నటించేందుకు వైకాపా నేతలకు కూడా అవకాశం ఇస్తామన్నారు. ఇందులో వయసు లేదా అందం లేదా అనుభవంతో పనలేదన్నారు. పనీబాటలేకుండా అడ్డ తిరుగుళ్లు తిరుగుతా బాధ్యతారాహిత్యంగా ఉంటే చాలన్నారు. మంత్రి అంబటి రాంబాబు కూడా తమను సంప్రదిస్తే అవకాశం ఇస్తామంటూ ఎద్దేవా చేశారు.