గురువారం, 3 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 6 జనవరి 2022 (13:24 IST)

నాకు ముగ్గురు కుమార్తెలు.. కానీ అల్లుళ్లు ఇద్దరే.. సోము వీర్రాజు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు తన కుటుంబానికి సంబంధించి ఓ ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. తనకు ముగ్గురు కుమార్తెలని, కానీ అల్లుళ్లు ఇద్దరేనని చెప్పారు. ఒక కుమార్తెకు తాను పెళ్లి చేయలేదు. ఆమె భర్తను నేను ఎపుడూ అల్లుడుగా స్వీకరించలేదు అని అన్నారు. 
 
తాజాగా సోము వీర్రాజు అల్లుడైన నరసింహంపై ఫోర్జరీ, చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ వార్తలపై సోము వీర్రాజు విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. తన ముగ్గురు కుమార్తెల్లో పెద్దమ్మాయికి తాను పెళ్లి చేయలేదన్నారు. తనకు ఇద్దరే అల్లుళ్లు అని చెప్పారు. 
 
తన పెద్దమ్మాయి తనే పెళ్లి చేసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయిందని, ఆమె పెళ్లి చేసుకున్న వ్యక్తికి తాను కాళ్లు కడిగి కన్యాదానం చేయలేదని, అందువల్ల అతడిని తన అల్లుడుగా ఎప్పటికీ స్వీకరించలేనని స్పష్టం చేశారు. 
 
ఎందుకంటే అతని వ్యక్తిత్వం నాకు నచ్చదు. గతంలోనే అతనిపై ఏలూరు డీఐజీకి ఫిర్యాదు చేశా. ఇకపై ఈ కేసులో, అతని విషయంలో ఎక్కడా నా పేరును ప్రస్తావించవద్దు అని మీడియాకు ఆయన విజ్ఞప్తి చేశారు.