గురువారం, 18 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 జనవరి 2021 (18:15 IST)

సుపరిపాలన అందిస్తున్నాం కదా.. ఓర్వలేకే ఈ దాడులు : సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆలయాల్లో ఉన్న దేవతామూర్తుల విగ్రహాలపై దుండగులు వరుస దాడులకు తెగబడుతున్నారు. ఈ దాడుల కారణంగా ఏపీ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. ఈ దాడులను లక్ష్యంగా చేసుకుని విపక్ష పార్టీల నేతలు విమర్శలకు దిగుతున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి స్పందించారు. 
 
రాజకీయాల కోసం దేవుళ్లను వాడుకుంటున్నారంటూ మండిపడ్డారు. గుడిలోని విగ్రహాలను కూడా ధ్వంసం చేస్తున్నారని.. తప్పు ఎవరు చేసినా తప్పే అని అన్నారు. ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో అయినా వదిలిపెట్టమని హెచ్చరించారు. 
 
కొందరికి దేవుడు అంటే కూడా భయం, భక్తి లేదని.. ప్రజల మనోభావాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవాలను టార్గెట్ చేసుకొని దాడులకు దిగుతున్నారన్నారు. 
 
అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరకుండా కుట్రలు చేస్తున్నారని జగన్ స్పష్టం చేశారు. దీనికి తోడు దాడి చేసిన వారే సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలకు తెరలేపుతున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి మంచి సుపరిపాలన అందిస్తున్నామని, దీన్ని ఓర్వలేని వారు.. ప్రభుత్వ పేరును నాశనం చేసేందుకు ఇటువంటి దాడులు చేస్తున్నారని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. 
 
తెలుగుదేశం పార్టీ పర్యవేక్షణలో ఉన్న ఆలయాల్లో ఈ ఘటనలు జరుగుతున్నాయని జగన్ అన్నారు. ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని, పొలిటికల్ గెరిల్లా వార్ జరుగుతోందని చెప్పారు. ఈ కేసులను పోలీసులు సమర్థవంతంగా తేల్చాలని అన్నారు. 
 
ప్రభుత్వం మంచి పనులు చేస్తున్నప్పుడు... ప్రజల దృష్టిని మరల్చేందుకు ఈ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. నాడు-నేడు కార్యక్రమానికి పేరు వస్తోందని 2019లో దుర్గగుడి ధ్వంసం అని ప్రచారం చేశారని, వెండి సింహాలను మాయం చేశారని దుయ్యబట్టారు. దిశ పోలీస్ స్టేషన్లకు వస్తున్న మంచి పేరును అడ్డుకోవడానికి కొన్ని గుడులను ధ్వంసం చేశారని చెప్పారు.
 
రైతు జలసిరి కార్యక్రమాన్ని మొదలు పెడితే నెల్లూరు జిల్లాలోని ఓ ఆలయంలో విగ్రహం ధ్వంసమయిందని జగన్ గుర్తుచేశారు. విద్యా దీవెన కార్యక్రమం ప్రారంభానికి మూడు రోజుల ముందు నుంచే కుట్రలకు తెరలేపారని అన్నారు. 
 
కర్నూలులో లక్ష్మీనారాయణస్వామి ఆలయం ఘటన చోటుచేసుకుందన్నారు. బీసీల కోసం చర్యలు చేపట్టినప్పుడు వీరభద్రస్వామి ఆలయాన్ని ధ్వంసం చేశారని అన్నారు. ఇంటి పట్టాలు ఇస్తున్నప్పుడు తిరుమల ఆలయ లైటింగ్‌లో ఏసుక్రీస్తు శిలువ అని ప్రచారం చేశారని దుయ్యబట్టారు. విజయనగరంలో ఇంటి పట్టాలు ఇస్తున్నప్పుడు రామతీర్థంలో విగ్రహాన్ని ధ్వంసం చేశారని అన్నారు.