1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 జనవరి 2021 (08:21 IST)

మిస్టర్ జగన్... ఏంటిది.. మీరేం చేస్తున్నారు.. : బీజేపీ నేత దేవధర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవతామూర్తుల విగ్రహాల ధ్వంసం కొనసాగుతోంది. ఈ ఘటనలపై విపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. ముఖ్యంగా, బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందులోభాగంగా, ఆంధ్రప్రదేశ్‌లో హిందూ ఆలయాలను రక్షించలేరా..? దేవదాయ మంత్రితో రాజీనామా ఎందుకు చేయించరు అంటూ బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్‌ దేవధర్‌ నిలదీశారు. 
 
రాష్ట్రంలో హిందూ ఆలయాలపై జరుగుతున్న వరుస ఘటనలను ఆక్షేపించారు. ఈ దాడులపై ఆయన స్పందిస్తూ, రాష్ట్రంలో ప్రస్తుతం రావణుడి పాలన సాగుతోందని దుయ్యబట్టారు. 'రామతీర్థంలో 400 ఏళ్ల చరిత్ర కలిగిన కోదండరాముడి విగ్రహ శిరస్సు తొలగించారు.. ఇప్పుడు 40 ఏళ్ల చరిత్ర కలిగిన సీతా మాత విగ్రహాన్ని విజయవాడలో హిందూ వ్యతిరేకులు ధ్వంసం చేశారని గుర్తుచేశారు. 
 
మిస్టర్.. జగన్మోహన్‌ రెడ్డీ..! మీరేం చేస్తున్నారు..? మీ మౌనంతో దేశానికి ఏం సందేశమిస్తున్నారు..? ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా నిరోధించడం మీకు చేతకాదా..? మీ ప్రభుత్వం మతమార్పిడులను ఎందుకు ప్రోత్సహిస్తోంది.? మీ ఉపముఖ్యమంత్రి తిరుమల ప్రాంగణంలో క్రిస్మస్‌ శుభాకాంక్షలు ఎలా చెబుతారు..? అదేరోజు చర్చిల వద్ద నిల్చొని మీ మంత్రులు ఎందుకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు చెప్పలేదు' అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.