దేశ పౌరులు గినియా పందుల్లా మారిపోనున్నారా? డాక్టర్ స్వామి
భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి మరోమారు మీడియాకెక్కారు. దేశ పౌరులు గినియా పందుల్లా మారిపోనున్నారా? అంటూ ప్రశ్నించారు. దీనికి కారణం లేకపోలేదు.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు అమెరికాకు చెందిన ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనికా సంయుక్తంగా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్‌కు భారత్‌లో అనుమతులు మంజూరు చేశారు. దీన్ని ఆయన తీవ్రంగా తప్పుబడుతున్నారు.
ఈ వ్యాక్సిన్ ను అత్యవసరంగా వినియోగించుకునేందుకు కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంతవరకూ అనుమతించలేదని గుర్తు చేసిన ఆయన, వ్యాక్సిన్ ప్రయోగాలకు భారతీయులను వాడుకుంటున్నారని ఆరోపించారు.
దేశంలోని పౌరులు గినియా పందుల్లా మారిపోనున్నారా? అంటూ తన ట్విట్టర్‌లో ప్రశ్నించారు. ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ను ఇండియాలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తుండగా, ఎమర్జెన్సీ యూసేజ్ కోసం నిపుణుల కమిటీ అనుమతించిన సంగతి తెలిసిందే.
ఆ వెంటనే ట్విట్టరాటీలు, దేశవాళీ టీకా గురించి ప్రశ్నించడం ప్రారంభించారు. స్వదేశీ శాస్త్రవేత్తల సామర్థ్యాన్ని తప్పుబడుతున్నారా? అంటూ ప్రశ్నించారు. ఇక ఈ వ్యాక్సిన్ బీజేపీ వ్యాక్సిన్ అంటూ సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను వ్యాక్సిన్ తీసుకోబోనని అన్నారు.
ఇదిలావుండగా, మోడెర్నా తయారుచేసిన వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగానికి అనుమతిస్తున్నామని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదేసమయంలో విజయవంతంగా పనిచేస్తున్న ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌పై ఎన్నో పేద దేశాలు ఆశలు పెంచుకుంటున్న వేళ, ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ఇంకా అనుమతి ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.