రాష్ట్రంలో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న గవర్నర్ దంపతులు
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రధమ పౌరుని హోదాలో తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఓటరుగా నమోదు అయిన గవర్నర్ దంపతులు బుధవారం జరిగే విజయవాడ నగర పాలక సంస్ధ ఎన్నికల పోలింగ్‌లో ఓటు వేయనున్నారు.
గవర్నర్ పేట నగర న్యాయ స్థానముల ప్రాంగణానికి ఎదురుగా రాజ్ భవన్‌కు సమీపంలోని చుండూరి వెంకట రెడ్డి ప్రభుత్వ నగర పాలక ఉన్నత పాఠశాల (సివిఆర్ జిఎంసి హైస్కూల్)లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లో ఉదయం 11 గంటల ప్రాంతంలో గౌరవ బిశ్వ భూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్‌లు ఓటు హక్కును వినియోగించుకుంటారని గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగనీయని రీతిలో రాజ్ భవన్ అధికారులు, జిల్లా యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని సమన్వయ పరుస్తున్నారు.