శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 23 నవంబరు 2021 (16:24 IST)

రాష్ట్ర ప్రజల ఆశీస్సులే అండగా నిలిచాయన్న గవర్నర్

కరోనా నుండి కోలుకున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మంగళవారం మధ్యాహ్నం విజయవాడ రాజ్ భవన్‌కు చేరుకున్నారు. గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పి సిసోడియా రాజ్ భవన్‌లో గవర్నర్ దంపతులకు స్వాగతం పలికారు.

 
ఈ సందర్భంగా గౌరవ గవర్నర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల ఆశీస్సులు, వైద్యుల సేవల ఫలితంగానే త్వరితగతిన కోలుకున్నానని వివరించారు. వాక్సిన్ ఎంతో ఉపయోగపడిందని, సకాలంలో రెండు డోసుల వాక్సిన్ తీసుకోవటం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదురుకాలేదన్నారు. ప్రత్యేకించి రాష్ట్ర ప్రజలు కరోనా విషయంలో జాగ్రత్త వహించాలని, తగ్గుముఖం పడుతున్నప్పటికీ ఎటువంటి అశ్రద్ధ కూడదని పేర్కొన్నారు.

 
తప్పనిసరిగా మాస్క్ ధరించటం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవటం, సామాజిక దూరాన్ని పాటించటం వంటివి మరి కొంతకాలం కొనసాగించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వివరించారు. గవర్నర్‌కు స్వాగతం పలికిన వారిలో రాజ్ భవన్ సంయుక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్, ఉప కార్యదర్శి సన్యాసి రావు తదితరులు ఉన్నారు.