ఆంధ్రాలో ఏం జరుగుతోంది... దెబ్బపడినట్టు తేలితే తీవ్ర పరిణామాలు: హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఐడీ పోలీసుల కస్టడీలో ఉన్న ఎంపీ రఘురామకృష్ణం రాజు గాయపడటంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోందని విస్మయం వ్యక్తంచేసింది. పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తిని కొట్టడమేమిటని ప్రశ్నించింది. పోలీసులు కొట్టడంవల్లే ఎంపీ గాయపడినట్లు తేలితే... తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.
అదేసమయంలో ఎంపీ రఘురామకృష్ణం రాజు శరీరం, ఒంటి పై ఉన్న గాయాలను పరిశీలించి నివేదిక అందించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన మెడికల్ బోర్డును నియమించింది. ఇందులో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, జనరల్ మెడిసిన్ విభాగాధిపతి, సూపరింటెండెంట్ నామినేట్ చేసిన మరో వైద్యుడు ఉంటారని తెలిపింది. వీరు తక్షణం పరీక్షలు నిర్వహించి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
ఎంపీని పరీక్షించే సమయంలో వీడియో తీయాలని ఆదేశించింది. వీడియోతోపాటు వివరాలను సీల్డ్ కవర్‌లో గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తికి అప్పగించాలని పేర్కొంది. వాటిని వెకేషన్ అధికారి ఎం.నాగేశ్వరావుకు పంపాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తికి సూచించింది. గుంటూరు మేజిస్ట్రేట్ ఎంపీ వాంగ్మూలాన్ని నమోదు చేసి ఉంటే జిల్లా ప్రధాన న్యాయమూర్తి ద్వారా దానిని వెకేషన్ అధికారికి పంపాలని ఆదేశించింది.
అవసరమైతే ఎంపీకి ఆసుపత్రిలో చికిత్స అందించాలని పిటిషనర్ తరపు న్యాయవాది అభ్యర్థనపై నిర్ణయాన్ని మెడికల్ బోర్డుకే వదిలేస్తున్నట్లు పేర్కొంది. ఎంపీకి పరీక్షలు నిర్వహించే సమయంలో కుటుంబ సభ్యులు, కుటుంబ వైద్యున్ని అనుమతించాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఎంపీకి ఉన్న వై-కేటగిరీ భద్రతను అనుమతించాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. ఎంపీని ఆసుపత్రిలో చేరిస్తే రాష్ట్ర పోలీసులతోనే భద్రత కల్పించాలని స్పష్టం చేసింది. విచారణను ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసింది.