సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 28 సెప్టెంబరు 2024 (15:02 IST)

డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే జగన్ డుమ్మా : మంత్రి అనిత

Anitha
శ్రీవేంకటేశ్వర స్వామిపై తనకు పూర్తి విశ్వాసాలు ఉన్నాయని పేర్కొనే తితిదే డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. పైగా, తిరుమలకు రావొద్దని జగన్‌కు పోలీసులు నోటీసులు ఇవ్వలేదన్నారు. అలాంటి నోటీసులు ఇచ్చివున్నట్టయితే మీడియాకు చూపించవచ్చు కదా అని ఆమె ప్రశ్నించారు. 
 
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె శనివారం విలేకరులతో మాట్లాడుతూ, మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతికి రాకుండా ఆపే ప్రయత్నం చేయలేదని, తిరుమలకు రావద్దని నోటీసులు కూడా ఇవ్వలేదని ఆమె స్పష్టం చేశారు. 
 
మాజీ సీఎం జగన్ ఇటీవల చాలా జిల్లాల్లో పర్యటించారని గుర్తు చేసిన మంత్రి... ఎక్కడా ఆయన్ను అడ్డుకోలేదన్నారు. శ్రీవారి లడ్డూలో కల్తీ వివాదాన్ని విచారించేందుకు సిట్ ఏర్పాటు చేయడాన్ని జగన్ తప్పుబట్టడం పట్ల అనిత మండిపడ్డారు. గతంలో ఆయన దగ్గర పనిచేసిన పోలీసులే సిట్లో ఉన్నారని గుర్తుచేశారు. తప్పు చేయకపోతే విజిలెన్స్ రిపోర్టుపై కోర్టుకు ఎందుకు వెళ్లారని ఆమె నిలదీశారు.
 
వైసీపీ అధినేతకు తిరుమల వెళ్లే ఇష్టంలేకే ఇలా అర్థాంతరంగా పర్యటన రద్దు చేసుకున్నారని మంత్రి ఆరోపించారు. టాపిక్ డైవర్షన్ కోసమే నోటీసుల గురించి మాట్లాదారని అన్నారు. జగన్ ఎప్పుడైనా తిరుమల లడ్డూ తిన్నారా? అని మంత్రి అనిత ప్రశ్నించారు. దేవుడి అక్షింతలు వేసిన వెంటనే దులుపుకున్న వ్యక్తి జగన్ అని, శ్రీవారి ప్రసాదాన్ని కూడా టిష్యూ పేపర్‌లో పెట్టి పక్కన పడేసే వ్యక్తులు జగన్ దంపతులు అని గుర్తు చేశారు. 
 
తితిదే నిబంధనల మేరకు డిక్లరేషన్ ఇచ్చి ఆయంలోకి వెళ్లడానికి జగన్‌కు వచ్చిన ఇబ్బంది ఏంటో తెలియడం లేదన్నారు. హైందవ సాంప్రదాయాలను ఆయన ఎందుకు గౌరవించడం లేదని మండిపడ్డారు. ఇక జగన్ ఇంతకుముందు ఏర్పాటు చేసిన పాలక మండలిలో ఒక్క దళితుడికి కూడా అవకాశం ఇవ్వలేదని, అలాంటి ఆయన ఇప్పుడు ఆలయంలో దళితుల ప్రవేశంపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. నేను హిందువును... నీ మతమేంటో ధైర్యంగా చెప్పగలవా? జగన్ అంటూ మంత్రి అనిత ప్రశ్నించారు.