శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (16:37 IST)

లడ్డూ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే డిక్లరేషన్... నా మతం మానవత్వం : జగన్ (Video)

ysjagan
శ్రీవారి లడ్డూ కల్తీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే తెరపైకి డిక్లరేషన్‌ అంశాన్ని తెరపైకి తెచ్చారని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. తాను చేపట్టిన రెండు రోజుల తిరుమల పర్యటనను ఆయన శుక్రవారం వాయిదా వేసుకున్నారు. తన తిరుమల పర్యటనపై ఆయన శుక్రవారం తాడేపల్లి ప్యాలెస్‌లో విలేకరులతో మాట్లాడుతూ, తాను దైవ దర్శనానికి వెళ్తామంటే అడ్డుకునే ప్రయత్నం చేయడం దేశంలో ఎప్పుడూ జరిగి ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
'జగన్‌ తిరుమల పర్యటనకు అనుమతి లేదని మా పార్టీ నేతలకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడూ చూడలేదు. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ శ్రేణులను రప్పిస్తున్నారు. లడ్డూల అంశాన్ని పక్కదారి పట్టించేందుకు డిక్లరేషన్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. తిరుమల లడ్డూపై చెప్పినవన్నీ అబద్దాలని రుజువులు కనిపిస్తున్నాయి. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి అసత్యాలు చెబుతున్నారు. తిరుమల పవిత్రతను, శ్రీవారి ప్రసాదాన్ని రాజకీయం చేస్తున్నారు' అంటూ మండిపడ్డారు. 
 
'జంతువుల కొవ్వుతో ప్రసాదాలు చేశారని అబద్ధాలు చెబుతున్నారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆధారాలు చూపిస్తాం. తతిదేలో 6 నెలలకు ఒకసారి టెండర్లు పిలవడం దశాబ్దాలుగా జరుగుతున్నదే. తక్కువ రేటుకు కోట్‌ చేసిన వారికి తితిదే టెండర్‌ ఖరారు చేస్తుంది. దశాబ్దాలుగా జరుగుతున్న కార్యక్రమాన్ని వివాదాస్పదం చేస్తున్నారు. క్వాలిటీ చెక్ చేయించాకే వాహనాలు వస్తాయి. తితిదే కూడా క్వాలిటీ చెక్‌ చేస్తోంది. పరీక్షలో విఫలమైన వాహనాలను వెనక్కి పంపడం సాధారణం. గతంలో తెదేపా హయాంలో కూడా కొన్ని ట్యాంకర్లను వెనక్కి పంపించారు. కల్తీ ప్రసాదాలను భక్తులు తిన్నట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారు. తితిదే బోర్డు సభ్యులుగా తీసుకోవాలని కేంద్రం, సీఎంలు సిఫారసు చేస్తారు. తితిదే బోర్డు సభ్యులు ప్రముఖులు.. పారదర్శకంగా పనిచేస్తారు' అని జగన్‌ పేర్కొన్నారు. 
 
'తప్పు చేసేందుకు అవకాశం లేని వ్యవస్థలో తితిదే ఉంది. మా హయాంలోనూ 18 సార్లు నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపారు. శ్రీవారి ప్రసాదాల్లో వాడని నెయ్యిని వాడినట్లు ఎందుకు అంటున్నారు. అప్పుడప్పుడు నమూనాలను సీఎఫ్‌టీఆర్‌ఐ మైసూర్‌కు పంపిస్తారు. ఇప్పుడు నమూనాల పరీక్షకు మొదటిసారిగా గుజరాత్‌కు పంపారు. గుజరాత్‌ నుంచి వచ్చిన నివేదికను తెదేపా కార్యాలయం రిలీజ్‌ చేసింది. రహస్య నివేదిక అయితే తెదేపా ఆఫీసు నుంచి ఎలా బయటకు వస్తుంది? ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిని వాడలేదని తితిదే ఈవో చెప్పారు. సెప్టెంబరు 22న తితిదే ఈవో ప్రభుత్వానికి లేఖ పంపారు. తితిదే ఈవో పలుసార్లు చెప్పినా వినకుండా సీఎం మళ్లీ అబద్ధాలు చెప్పారు. రాజకీయంగా లబ్ధిపొందేందుకే ఇలా అబద్ధాలు ఆడుతున్నారు. తిరుమల ప్రసాదాలపై ఇలా దుష్ప్రచారం చేయడం అపవిత్రత కాదా?' అని జగన్‌ ప్రశ్నించారు.