ప్రైవేట్ లేఔట్ వేస్తే... 5 శాతం భూమి ప్రభుత్వానికి ఇవ్వాల్సిందే!
ఆదాయం లేక అప్పుల ఊబిలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. దీని నుంచి బయట పడటానికి రకరకాల ఆలోచనలు చేస్తోంది... సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అయితే, దీనికి వినూత్న ఆలోచనలు చేయాల్సింది పోయి, ఎవరో ఆయన్ని తప్పుదారి పట్టిస్తున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనితో రకరకాల మార్గాలు వెతుకుతూ, అన్ని వర్గాలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. అసలే జగన్మోహన్ రెడ్డి ప్రబుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పూర్తిగా అడుగంటిపోగా, ఇపుడు దానిపైనా తాజాగా భారం మోపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ లేఔట్ల నిర్మాణాల్లో 5 శాతం భూమిని ప్రభుత్వానికి ఇవ్వాలంటూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ భూమిని సంబంధిత జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని ఆదేశించింది ఏపీ ప్రభుత్వం. కొత్తగా నిర్మించే లే ఔట్‌లో భూమిని ఇవ్వలేకుంటే, దానికి మూడు కిలోమీటర్ల పరిధిలో భూమిని కొని ఇవ్వాలని నిబంధన విధించింది. లేని పక్షంలో ఆ భూమి విలువ మేర డబ్బులు కూడా చెల్లించే ఆప్షన్ కూడా ప్రభుత్వం ఇచ్చింది. ఇక, లే ఔట్ల డెవలపర్ల ద్వారా వచ్చే భూమిని లేదా నగదును పేదల కోసం నిర్మించే జగనన్న కాలనీలకు వినియోగించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
ప్రయివేటు భూమిపైనా ప్రభుత్వ జులుం ఏంటని రియల్టర్లు ప్రశ్నిస్తున్నారు. ఇది నీ భూమి, నా వాటా పధకం అని విమర్శిస్తున్నారు. ప్రతి లేఅవుట్ నుంచి, ప్రభుత్వానికి 5% ఇవ్వాలని అధికారిక ఉత్తర్వులు జారీ చేయడంపై తలలు బాదుకుంటున్నారు. లేఅవుట్ లో స్థలం కొనుక్కునే సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ఇది భారం అవుతుంది.