సంక్షోభంలో ఉన్న చిన్న, చిన్న పరిశ్రమలు, సంస్థల పునరుద్ధరణతో పాటు, వాటి స్థిరీకరణలో తోడ్పాటు అందించేందుకు నిర్దేశించిన ఒక బృహత్తర పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
‘సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థ’ (ఎంఎస్‌ఎంఈ)లు, ‘రుణాల ఏక కాల పునర్‌వ్యవస్థీకరణ’ (ఓటీఆర్) ప్రక్రియతో కూడిన ‘డాక్టర్ వైయస్సార్ నవోదయం’ పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించారు.
సంక్షోభంలో కూరుకుపోయిన సంస్థలు, పరిశ్రమల పునరుద్ధరణతో పాటు, ఈ రంగంలో కీలకమైన అభివృద్ధి చోదకంగా ‘డాక్టర్ వైయస్సార్ నవోదయం’ పథకం పని చేయనుంది. ఇంకా అన్ని జిల్లాలలో రంగాల వారీగా అధ్యయనాలు చేపట్టి వాటికి అనుకూల విధానాలు కూడా రూపొందిస్తారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రంలో దాదాపు 85 వేల యూనిట్లు ప్రయోజనం పొందనున్నాయి. లక్షల మందికి ఉపాధి కల్పించే ఎంఎస్‌ఎంఈలను ఆదుకుంటామని ప్రకటించిన సీఎం వైయస్ జగన్, ఆ దిశలో డాక్టర్ వైయస్సార్ నవోదయం పథకం అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పథకం కోసం రూ.10 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎంఎస్‌ఎంఈల పాత్ర
దేశంలో సూక్ష్మ, స్థూల, చిన్నతరహా సంస్థలు, పరిశ్రమలది కీలకపాత్ర అని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. డాక్టర్ వైయస్సార్ నవోదయం పథకం ప్రారంభం అనంతరం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఎంఎస్‌ఎంఈలు దేశ స్థూల జాతీయోత్పత్తి (జీఎస్డీపీ)లో 8 శాతం, ఎగుమతుల్లో 40 శాతం, ఉత్పత్తి రంగంలో 45 శాతం వాటా కలిగి ఉన్నాయని వెల్లడించారు.
ముఖ్యంగా ఆహారం, భవన నిర్మాణ రంగం, ఔషథాలు, ఫాబ్రికేటెడ్ వస్తువుల ఉత్పత్తి రంగాలలో ఎంఎస్‌ఎంఈలు కీలకపాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాథిని ఈ రంగం కల్పిస్తోందని అన్నారు.
రాష్ట్రంలోనూ రూ.30,528 కోట్ల పెట్టుబడితో 1,00,629 ఎంఎస్‌ఎంఈలు పని చేస్తున్నాయని, వీటి ద్వారా 10,84,810 మందికి ఉపాధి లభిస్తోందని ఆర్థిక మంత్రి వెల్లడించారు.
ఎంఎస్‌ఎంఈల సమస్యల పై....
పరిశ్రమల, సంస్థల ఏర్పాటులో పెట్టుబడి, ఆ తర్వాత వర్కింగ్ క్యాపిటల్, సంస్థల విస్తరణ, మార్కెట్‌లో ఒడిదుడుకులు ఈ రంగాన్ని దెబ్బ తీస్తున్నాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. మరోవైపు నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించుకోవడంలోనూ, ఉత్పత్తుల మార్కెటింగ్‌లోనూ ఈ రంగం ఇబ్బంది పడుతోందని చెప్పారు.
భూముల ధరలు పెరగడంతో పాటు, పెట్టుబడి కూడా భారీగా పెరగడం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలను నష్టాల బాట పట్టిస్తోందని పేర్కొన్నారు. వీటన్నింటి నేపథ్యంలోనే భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ‘రుణాల ఏకకాల పునర్‌వ్యవస్థీకరణ’ (ఓటీఆర్)ను ప్రకటించిందని తెలిపారు. నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) ప్రకటించిన సంస్థలు ఓటీఆర్‌లోకి వస్తే, రుణాల చెల్లింపునకు వారికి గరిష్టంగా ఆరేళ్ల సమయం లభిస్తుందని చెప్పారు.
డాక్టర్ వైయస్సార్ నవోదయం
రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈలకు మరింత అండగా నిల్చేందుకు ఈ ఏడాది సెప్టెంబరు 9న జీఓ.75 ద్వారా ‘డాక్టర్ వైయస్సార్ నవోదయం’ పథకానికి శ్రీకారం చుట్టిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. ఇందుకు బ్యాంకర్లు కూడా పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు.
పధకం ప్రయోజనాలు..
డాక్టర్ వైయస్సార్ నవోదయం పథకం ద్వారా రాష్ట్రంలో 85,070 యూనిట్లకు ప్రయోజనం కలగనుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. బ్యాంకర్లతో కలిసి ఓటీఆర్‌లో రూ.3,493 కోట్ల రూపాయల మేర ఆ యూనిట్లకు ఓటీఆర్‌లో లబ్ధి చేకూర్చనున్నట్లు ఆయన వివరించారు.
పథకం అర్హత–నిబంధనలు:
– రూ.25 కోట్ల వరకు ఎంఎస్‌ఎంఈ రుణాలు.
– ఎంఎస్‌ఎంఈ ఖాతా ప్రామాణిక ఆస్తిగా ఉండాలి.
– ఎంఎస్‌ఎంఈలకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఉండాలి.
– లేదా ఆ మినహాయింపు పొందిన జాబితాలో ఉండాలి.
– పునర్‌వ్యవస్థీకరణ సదుపాయానికి వచ్చే ఏడాది మార్చి 31 ఆఖరు తేదీ.
పథకం–తోడ్పాటు చర్యలు:
– ప్రతి ఖాతాకు 50 శాతం ఆడిటర్స్ రుసుము (గరిష్టంగా రూ.2 లక్షల వరకు) తిరిగి చెల్లింపు
– అర్హత కలిగిన ఎంఎస్‌ఎంఈలు ఓటీఆర్‌తో లబ్ధి పొందడానికి చేయూత
– నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ)గా పరిగణింపబడిన కేసులలో ప్రోత్సాహకాల విడుదలకు ప్రాధాన్యం.
- రుణాల క్రమబద్ధీకరణకు సహాయం.
– కలెక్టర్ల అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీలు
– అర్హత కలిగిన అన్ని సంస్థలకు ఈ పథకం సమర్థంగా ఉపయోగపడేలా చర్యలు
– ప్రతి నెలా కమిటీల భేటీ
– జిల్లాల్లో ఆయా రంగాల వారీగా అధ్యయనం.