సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 15 జులై 2021 (09:20 IST)

చంద్ర బాబుకు జ్ఞానోదయం కాలేదు: మంత్రి నాని

అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మంచి పని చేయకుండా.. అధికారం పోయిన తర్వాత మళ్లీ నాకు అధికారం ఇవ్వండి, నేను ఉంటే ఇది చేసేవాడిని.. అది చేసేవాడిని అంటూ నేరగాళ్ళ ఓదార్పు యాత్ర చేస్తూ ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని రవాణా, సమాచార శాఖ మంత్రి  పేర్ని నాని సూటిగా ప్రశ్నించారు.

కొల్లు రవీంద్ర.. గతంలో అచ్చెన్నాయుడు.. ఇలా ప్రభుత్వ సొమ్ముని, ప్రజల సొమ్ముని తినేసిన వాళ్ళని, తన సహ దొంగల్ని సమర్థించుకునే పనిలో చంద్రబాబు పడ్డాడు అని ధ్వజమెత్తారు. ఎప్పుడో చనిపోయినవారిని పరామర్శించడానికి వెంటనే రావాలి కానీ, కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన బాధ నుంచి తేరుకుంటున్న వారిని మళ్లీ తన పరామర్శల పేరుతో బాధించడం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు వచ్చింది పరామర్శించడానికా? లేక పాత లెక్కలు తేల్చుకోవడానికా.. అని మంత్రి ప్రశ్నించారు.

చనిపోయిన రెండు నెలల తర్వాత తీరిగ్గా పరామర్శలకు వచ్చిన చంద్రబాబు ఆ పని పూర్తి చేసుకుని వెళ్లాలే కానీ, దిగజారి రాజకీయాలు మాట్లాడటం, ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడం ఏంటని నిలదీశారు. టీడీపీ అధికారంలో ఉంటే కరోనాను కంట్రోల్‌ చేసేవాడినని ఆయన చెప్పుకుంటున్నారని, ఆయనకు అంత సత్తా ఉంటే హైదరాబాద్‌ వెళ్లి ఎందుకు దాక్కున్నారని, ఇళ్లలో నుంచి ఎందుకు బయటకు రాలేదని ప్రశ్నించారు.

"14 ఏళ్ల ముఖ్యమత్రిగా ఉండి, 40 ఏళ్లు ఇండస్ట్రీ అని చెప్పుకునే మీరు ఎవరికి ఆదర్శంగా ఉన్నారు..? దొంగలకు, వెన్నుపోటుదారులకు మాత్రమే మీరు ఆదర్శంగా ఉన్నారు. రాజకీయాల్లోకి వద్దామనుకునే యువకులకు మీరు ఏవిధంగా ఆదర్శమని" మంత్రి నాని ప్రశ్నించారు. 
 
‘కృష్ణా డెల్టాకు నీళ్లు ఇస్తే తనకు జిల్లా ప్రజలు ఓటు వేయలేదని చంద్రబాబు మాట్లాడుతున్నారు’ మీకు అన్నం పెడితే కృష్ణాజిల్లా ప్రజలు నా చేయి కరిచారని మాట్లాడతారా.. ఎంత దౌర్బాగ్యం చంద్రబాబు ...? మీరు 2014లో సీఎం అయ్యేవరకూ కృష్ణాడెల్టాలో రెండు పంటలు పండించిన ఘనత రైతులది. మీరు వచ్చి ఏం చేశారు. మా రెండు పంటలను ఒక పంట చేశారు. మీ అయిదేళ్లలో దాళ్వా పంటకు అసలు నీళ్లు ఇచ్చారా?

కృష్ణాడెల్టా రైతులకు సున్నం పూసి, అసత్యాలు మాట్లాడుతున్నారని పేర్ని నాని విమర్శించారు. అందుకే ప్రజలు గట్టిగా మీకు బుద్ధి చెప్పి... ఎక్కడ కారం పూయాలో అక్కడ పూసారన్నారు. రాయలసీమకు మీరు నీళ్లు ఇస్తే అక్కడి ప్రజలు ఎందుకు వాతలు పెట్టారనేది.. ఈరోజుకు కూడా జ్ఞానం రాకపోతే ఎలా చంద్రబాబు గారూ.. అని ప్రశ్నించారు.