సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 అక్టోబరు 2022 (15:22 IST)

రాజకీయ పార్టీ నేత ఎలా అభివాదం చేయాలో పోలీసులే నిర్ణయిస్తారా? చంద్రబాబు

chandrababu
జిల్లాల పర్యటనలకు వెళ్లే రాజకీయ నేతలు ప్రజలకు, పార్టీ కార్యకర్తలు ఎలా అభివాదం చేయాలో పోలీసులే నిర్ణయిస్తారా? అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. జనవాణి పేరుతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శనివారం నుంచి మూడు రోజుల పాటు విశాఖపట్టణంలో పర్యటిస్తున్నారు. ఆయన శనివారం విశాఖ విమానాశ్రయానికి చేరుకోగానే జనసేన పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆ సమయంలో అక్కడ ఉన్న వైకాపా మంత్రులపై జనసైనికులు దాడులు చేశారని పోలీసులు ఆరోపిస్తూ వారిపై హత్యాయత్న కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 4 గంటల లోపు వైజాగ్‌ను  ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ పవన్‌కు వైజాగ్ పోలీసులు నోటీసులు జారీచేశారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. 
 
విశాఖలో వైసీపీ ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి వైసీపీ చేస్తున్న కుట్రలు దుర్మార్గం అని విమర్శించారు. పవన్ కల్యాణ్ బస చేస్తున్న హోటల్‌లో సోదాలు నిర్వహించడం, నాయకులను బెదిరించడం నియంత పాలనకు నిదర్శనమన్నారు. 
 
ఒక పార్టీ అధినేత కారులో కూర్చోవాలా? బయటకు వచ్చి అభివాదం చేయాలన్నది కూడా పోలీసులే నిర్ణయిస్తారా? అంటూ ప్రశ్నించారు. విశాఖ ఎయిర్ పోర్టు ఘటన పేరుతో పదుల సంఖ్యలో అక్రమంగా అరెస్ట్ చేసిన జనసేన నాయకులను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని తెలిపారు. ర్యాలీకి అనుమతి అడిగిన నేతలపై హత్యాయత్నం సెక్షన్ల కింద కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చంద్రబాబు వివరించారు.