సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

బాల్య స్నేహితుడు బొజ్జల పాడె మోసిన చంద్రబాబు

chandrababu
ఈ నెల ఆరో తేదీన గుండెపోటుతో మరణించిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అంత్యక్రియలు ఆదివారం ఆయన స్వగ్రామంలో జరిగాయి. ఈ వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొని తన బాల్య స్నేహితుడైన బొజ్జల పాడె మోశారు. ఈ అంత్యక్రియలు బొజ్జల వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన వరకు చంద్రబాబు పాడె మోశారు. జిల్లా యంత్రాంగం అధికార లాంఛనాల నడుమ ఆదివారం 11.50 గంటలకు అంత్యక్రియలు ముగిశాయి. 
 
అంత్యక్రియలు ముగిసిన తర్వాత చంద్రబాబు నేరుగా బొజ్జల నివాసానికి చేరుకుని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారితో అరగంట సేవు గడిపారు. ఈ సందర్భంగా తన బాల్య స్నేహితుడితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లోనూ, వ్యక్తిగత జీవితంలోనూ విలువలకు, విశ్వసనీయతకు మారుపేరు గోపాలకృష్ణారెడ్డి అని కొనియాడారు.
 
విద్యార్థి దశ నుంచీ తామిద్దరం మంచి స్నేహితులమని గుర్తుచేసుకున్నారు. ఎంత ఆప్తమిత్రుడైనా వ్యక్తిగత ప్రయోజనాలకు స్నేహాన్ని ఆయన ఎన్నడూ వాడుకోలేదన్నారు. ఏదడిగినా శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని చెప్పారు. ఎన్నో సంక్షోభాల్లో తనకు అండగా ఉన్నారని, ఏ పని చెప్పినా తూచ తప్పకుండా అమలుచేసే అనుచరుడిని కోల్పోవడం బాధగా ఉందన్నారు.