శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 2 డిశెంబరు 2019 (08:04 IST)

మనబడి నాడు–నేడు పర్యవేక్షణకు కమిటీ

మన బడి నాడు–నేడు కార్యక్రమం పర్యవేక్షణకు రాష్ట్రస్థాయి కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల్ని కల్పించేందుకు నిర్దేశించిన ఈ కార్యక్రమం అమలుకు ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసి పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శి నీలం సాహ్ని శనివారం జీఓ జారీ చేశారు. పాఠశాల విద్యా శాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్, సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ శాఖల యాజమాన్యంలోని 44,512 పాఠశాలల్లో 2019–20 నుంచి వచ్చే మూడేళ్లలో మౌలిక వసతులు కల్పిస్తారు. 

ఇవీ మార్గదర్శకాలు..
- మొదటి సంవత్సరం 15,715 పాఠశాలల్లో ఈ ప్రాజెక్ట్‌ అమలు చేస్తారు. 
- ప్రతి యాజమాన్యం నుంచి మూడో వంతు పాఠశాలలను ఏపీ సమగ్ర శిక్ష సొసైటీ డైరెక్టర్‌ ఎంపిక చేస్తారు.  
- పాఠశాలల్లో రన్నింగ్‌ వాటర్‌తో కూడిన టాయిలెట్లు, ఫ్యాన్లు, లైట్లు, తాగునీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బందికి అవసరమైన ఫర్నిచర్, పాఠశాలకు పెయింటింగ్, చిన్నాపెద్ద మరమ్మతులు, గ్రీన్‌ చాక్‌ బోర్డులు, ఇంగ్లిష్‌ ల్యాబ్‌లు, కాంపౌండ్‌ వాల్స్‌ నిర్మించి ప్రమాణాలను మెరుగుపరుస్తారు. 
- ఏపీ సమగ్ర శిక్ష సొసైటీ, ఏపీఈడబ్లు్యఐడీసీ, పంచాయతీరాజ్, మున్సిపల్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్, గిరిజన సంక్షేమ శాఖల ఇంజనీరింగ్‌ విభాగాలు ఈ పథకం అమలుకు ఏజెన్సీలుగా పనిచేస్తాయి.  
- పథకం అమలు తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయిలో పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా, కమిషనర్‌ కన్వీనర్‌గా, జిల్లా స్థాయిలో కలెక్టర్‌ చైర్మన్‌గా, డీఈఓ కన్వీనర్‌గా రెండు కమిటీలు ఏర్పాటవుతాయి.  
- ఇంప్లిమెంటింగ్‌ ఏజెన్సీలతో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్ల ద్వారా జిల్లా కలెక్టర్‌ పాఠశాల, పనుల వారీగా సవివర నివేదికలు తయారు చేయించుకోలి. 
- పాఠశాల ప్రాంగణాలు అందమైన వాతావరణంతో పిల్లలు ఎక్కువ సమయం అక్కడ గడిపేలా తయారు చేయాలి. కొత్త నిర్మాణాలు 75 సంవత్సరాలపాటు ఉండేలా చూడాలి. 
- సవివర నివేదికలు తయారు చేయడానికి ముందు అమలు ఏజెన్సీలు పేరెంట్స్‌ కమిటీ సలహాలు, సూచనలు తీసుకోవాలి. అంచనాలు సమర్పించడానికి ముందు అందుకు పేరెంట్‌ కమిటీల తీర్మానం తీసుకోవాలి. 
- గ్రీన్‌ బిల్డింగ్‌ నిబంధనల ప్రకారంపాఠశాలల్లో సౌకర్యాలు కల్పించేలా అంచనాలు ఉండాలి. దివ్యాంగ విద్యార్థులు సైతం స్వేచ్ఛగా తిరిగే వాతావరణం కల్పించాలి.  
- స్వాతంత్య్రానికి ముందు కట్టిన కొన్ని పాఠశాలల పురావస్తు ప్రాధాన్యం పోకుండా చూడాలి. వాటి మరమ్మతులు కూడా అదే సంప్రదాయ రీతుల్లో ఉండేలా చూడాలి.  
- కాంపౌడ్‌ వాల్‌ అంచనాలను ఉపాధి హామీ పథకం కింద తీసుకోవాలి. పేరెంట్స్‌ కమిటీలు ఈ పనిని పర్యవేక్షిస్తాయి.  
- పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ ఈ పథకం అమలును పూర్తిస్థాయిలో పర్యవేక్షించి అన్ని విభాగాలను సమన్వయం చేస్తారు.  
- పథకం అమలుకు వివిధ స్థాయిల్లో శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేసుకోవాలి.