శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 19 మార్చి 2021 (21:59 IST)

హమ్మయ్య, వేద పాఠశాల విద్యార్థులు సేఫ్

సెకండ్ వేవ్ కరోనా మళ్ళీ మొదలైందన్న విషయం తెలిసిందే. ఎపిలో వేగంగా వ్యాపిస్తోంది. కరోనా సోకిన వారు ఇళ్ళలోనో.. లేకుంటే ప్రభుత్వ ఆసుప్రతులకు వెళుతున్నారు. ప్రత్యేకంగా కరోనా కోసం గతంలోలా వార్డులు కూడా లేవు. అయితే తిరుమలలో వేదపాఠశాల విద్యార్థులు కరోనా బారిన పడటం పెద్ద చర్చకు దారితీసింది.
 
అది కూడా వేదాలను నేర్చుకునే వేదపాఠశాల విద్యార్థులు ఒకరిద్దరు కాదు.. ఏకంగా 56 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. టిటిడిలోను ఇది పెద్ద చర్చకే దారితీసింది. చివరకు వేద పాఠశాలలోని అందరు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పరీక్షలు చేశారు.
 
56 మంది కరోనా నిర్థారణ కావడంతో వారిని మాత్రమే తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి వారం రోజుల క్రితం తీసుకొచ్చి చేర్పించారు. అయితే వారంరోజుల పాటు మెరుగైన వైద్యాన్ని వారికి అందించారు. చివరకు కరోనా నుంచి కోలుకున్నారు వేదపాఠశాల విద్యార్థులు.
 
సంపూర్ణ ఆరోగ్యంతో వారు బయటకు వచ్చారు. వేదపాఠశాల విద్యార్థులతో స్వయంగా ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడారు. మరో 10 రోజుల పాటు ఇంటి దగ్గరే ఉండాలని వైద్యులు సూచించారు. వేదపాఠశాల విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించడం వల్లనే వారు సురక్షితంగా బయటపడగలిగారని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి చెప్పారు.