ప్రతిపక్ష హోదా కావాలా? జర్మనీకి వెళ్లండి జగన్: డిప్యూటీ సీఎం పవన్ పంచ్
రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధనలకు విరుద్ధంగా మాకు ప్రతిపక్ష హోదా కావాలంటూ వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి అడుగుతున్నారనీ, వారు ఇలాగే మంకుపట్టు పడితే అలాంటి సౌకర్యం ప్రస్తుతం జర్మనీలో వుందని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. కావాలంటే వాళ్లు అక్కడికి వెళ్లిపోవచ్చు అంటూ సెటైర్లు వేసారు.
ప్రతిపక్ష హోదా కావాలంటూ డిమాండ్ చేస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ గట్టిగా ఇచ్చి పడేశారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభ రోజున పవన్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ ఐదేళ్లపాటు ప్రతిపక్ష హోదా తమకు రాదని వైకాపా నేతలు మానసికంగా ఫిక్స్ అయితే మంచిదని పవన్ హితవు పలికారు.
అసెంబ్లీ సమావేశాలకు తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి సభకు వచ్చిన జగన్ కేవలం 11 నిమిషాల్లోనే సభ నుంచి వాకౌట్ చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, శాసనసభలో గవర్నర్ ప్రసంగ సమయంలో ప్రతిపక్ష సభ్యులు వ్యవహరించిన తీర్పు ఏమాత్రం సరైందని కాదన్నారు.
గవర్నర్‌కు ఆరోగ్యం సరిగా లేకపోయినా సభకు వచ్చి ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారన్నారు. అలాంటి గవర్నర్ ప్రసంగాన్ని వైకాపా సభ్యులు అడ్డుకోవాలని చూడటం హేయమైన చర్యగా అభివర్ణించారు. ప్రతిపక్ష హోదా అడిగితే వచ్చేది కాదు ప్రజలు ఇస్తేనే వస్తుందన్నారు. పైగా, ఇపుడు అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా జనసేన ఉందన్నారు. జనసేన కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చినా ప్రతిక్షపక్ష హోదా వైకాపాకు వచ్చేదన్నారు. సభలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన అనే విషయాన్ని గుర్తించాలని ఆయన హితవు పలికారు.
కేవలం 11 సీట్లు మాత్రమే ఉన్న వైకాపాకు ప్రతిపక్ష హోదా వస్తుందని ఎలా ఊహిస్తున్నారని ప్రశ్నించారు. ఈ ఐదేళ్ళలో వైకాపాకు ప్రతిపక్ష హోదా రాదనే విషయాన్ని జగన్‌తో పాటు వైకాపా నేతలు కూడా మానసికంగా ఫిక్స్ అయిపోవాలని సూచించారు. వైకాపా నేతలు సభకు వస్తే ఆ పార్టీకి ఉన్న బలం బట్టి ఎంత సమయం కేటాయంచాలో స్పీకర్ నిర్ణయిస్తారని తెలిపారు.