ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 జనవరి 2023 (15:16 IST)

త్వరలోనే ఏపీకి మంచి రోజులు.. నవ్యాంధ్రకు అమరావతే రాజధాని : డీఎల్ రవీంద్రారెడ్డి

DL Ravindra reddy
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి త్వరలోనే మంచి రోజులు రానున్నాయని వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు. అదేసమయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మనస్సులో లేకపోయినప్పటికీ ప్రజలందరి దృష్టిలో నవ్యాంధ్ర రాజధాని అమరావతే అని ఆయన అన్నారు. పైగా, ఈ విషయంలో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లినా గెలవలేరని డీఎల్ అన్నారు. 
 
రాజధాని అమరావతికి మద్దతు ఇవ్వాల్సిందిగా అమరావతి జేఏసీ నేతలు డీఎల్ రవీంద్రారెడ్డిని కలిసి కోరారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ దృష్టిలో కాకపోయినా ప్రజల దృష్టిలో అమరావతే రాజధాని అని వ్యాఖ్యానించారు. అందువల్ల జగన్ సుప్రీంకోర్టుకు వెళ్ళినా గెలవలేరని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధానిగా అమరావతే ఉంటుందని స్పష్టం చేశారు. 
 
జగన్ ఆలోచన అంతా అధికారం, డబ్బు తప్ప మరేమీ ఉండదన్నారు. ప్రత్యర్థులను వేధించడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారని, అందుకే ఆయన అధికారంలోకి వచ్చినట్టుగా ఉందన్నారు. జగన్ రెడ్డి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఓటమి తథ్యమని, అదేసమయంలో ఏపీకి త్వరలోనే మంచి రోజులు వస్తాయని తెలిపారు.