గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 ఆగస్టు 2021 (12:58 IST)

చంద్రబాబుకు ఝలకిచ్చిన గోరంట్ల : వైకాపా తీర్థమా?

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతల్లో ఒకరైన మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆ పార్టీకి రాజీనామా చేశారు. రెండు మూడ్రోజుల్లో శాసన సభ్యత్వానికి, టీడీపీకి రాజీనామా చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 
 
ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ తీరుపై బుచ్చయ్య తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు తెలియవచ్చింది. సీనియర్లను హైకమాండ్ అవమానిస్తోందని బుచ్చయ్య ఆవేదనకు లోనైనట్లు సమాచారం. తనలాంటి సీనియర్ నేత ఫోన్‌ను కూడా తండ్రీకొడుకు (నారా చంద్రబాబు, నారా లోకేష్) అటెండ్ చేయట్లేదని ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని తెలుస్తోంది.
 
కాగా, టీడీపీ ఆవిర్భావం నుంచి బుచ్చయ్య చౌదరి పార్టీలో ఉన్నారు. 1995 టీడీపీ సంక్షోభంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ వెంటే బుచ్యయ్య నడిచారు. అయితే.. చంద్రబాబు ఆధ్వర్యంలో పార్టీ అధికారంలోకి వచ్చాక సీనియర్ నేత అయినప్పటికీ ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. అధినేత తీరుపై అప్పట్లో బుచ్చయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. 
 
ప్రస్తుతం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా చౌదరి ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ హవాను తట్టుకుని నిలిచి మరీ బుచ్చయ్య విజయం సాధించారు. ఆయన పార్టీ మార్పుపై ఇంతవరకూ తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరూ రియాక్ట్ అవ్వలేదు. అలాంటి బుచ్చయ్య చౌదరి ఇపుడు వైకాపాలో చేరేందుకు మొగ్గుచూపుతున్నారు.