సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 1 ఆగస్టు 2021 (13:14 IST)

జన్మదిన వేడుకలకు గవర్నర్ దూరం

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్,  ఆగస్టు 3 నాటి తన జన్మదినాన్ని ఈ సంవత్సరం కూడా జరుపుకోకూడదని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితి కారణంగా మాననీయ గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో  తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు ఎవ్వరూ రాజ్ భవన్‌కు రావద్దని బిశ్వ భూషణ్ హరిచందన్ విజ్ఞప్తి చేశారు.
 
కరోనా ప్రమాదాన్ని తగ్గించడంలో, వైరస్ నుండి రక్షణ కల్పించడంలో టీకా సహాయపడగలదని, అర్హులైన వారందరూ వీలైనంత త్వరగా టీకాలు వేయించుకోవాలని ఈ సందర్భంగా గవర్నర్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం మనం రెండవ తరంగంలో ఉండగా,  కొత్త వేరియంట్‌ల ఆవిర్భావం కారణంగా మూడవ తరంగం సంభవించడంపై ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారని గవర్నర్ గుర్తు చేశారు.

ఈ పరిస్థితుల్లో ముసుగు ధరించడం, సామాజిక దూరం పాటించడం, కోవిడ్‌ ప్రవర్తనా నియమావళిని అనుసరించడం తప్పనిసరన్నారు. చేతులు తరచూ శుభ్రం చేసుకోవటం కోవిడ్ -19 వ్యాప్తిని నిరోధిస్తుందని గవర్నర్ వివరించారు.

టీకాలు వేసుకున్న వారు కూడా తమ ఇతర కుటుంబ సభ్యులను రక్షించుకోవడానికి ఈ మార్గదర్శకాలను పాటించాలని గవర్నర్ సూచించారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.