శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 18 అక్టోబరు 2018 (10:40 IST)

న్యాయం కోసం వెళితే కోర్కె తీర్చమన్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్...

అన్ని విధాలుగా నష్టపోయి న్యాయం చేయమని ఠాణాకు వెళ్లిన ఓ మహిళకు ఊహించని సంఘటన ఒకటి ఎదురైంది. కేసు విచారణ పేరుతో ఆమె గురించిన అన్ని విషయాలు తెలుసుకుని తన కోర్కె తీర్చాలంటూ ఓ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వేధించాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కొద్ది రోజుల క్రితం ఓ మహిళ ఓ వ్యక్తి తనను అన్యాయం చేశాడని, తన నుంచి డబ్బు కూడా కాజేశాడని, న్యాయం చేయాలని గంటూరు నగరంలోని ఓ సీఐను ఆశ్రయించింది. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అప్పటికే ఆ మహిళపై కన్నేసిన సీఐ ఆమెను లోబర్చుకోవాలనే దురుద్దేశంతోనే కేసును నాన్చుతూ వచ్చాడు.
 
దీంతో బాధితురాలు స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్న క్రమంలో ఆమెతో చనువుగా వ్యవహరించాడు. న్యాయం చేయకపోగా తనను లైంగికంగా వేధిస్తుండటంతో తట్టుకోలేకపోయిన బాధితురాలు జిల్లా ఎస్పీని ఆశ్రయించి భోరుమన్నారు. తనకు వాట్సాప్‌ ద్వారా సందేశాలు పంపారని, న్యాయం చేస్తారేమోనని తాను కూడా ఇంతకాలం ఓపికగా ఎదురు చూశానని ఆమె పోలీసు అధికారుల వద్ద మొరపెట్టుకుంది. 
 
తనకు న్యాయం చేయకపోగా చివరకు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారులు షాక్‌కు గురయ్యారు. ఈ మొత్తం వ్యవహారంపై అర్బన్‌ ఎస్పీ విచారణకు ఆదేశించారు. విచారణ జరిపిన డీఎస్పీ స్థాయి అధికారి ఆయా ఆరోపణలు వాస్తవమేనని అర్బన్‌ ఎస్పీకి నివేదిక అందజేశారు. దీనిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అర్బన్‌ ఎస్పీ ఆ నివేదికను ఐజీకి పంపారు.