#HBDManOfMassesYSJagan : నగరిలో టెన్షన్... టెన్షన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను అధికార వైకాపా పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఘనగా నిర్వహిస్తున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా, వైకాపా కార్యకర్తలు, నేతలు భారీ ఎత్తున వివిధ రకాలైన సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఇలాంటి వారిలో నగరి ఎమ్మెల్యే ఆర్కే. రోజా ఒకరు. ఈమె కూడా తన సొంత నియోజకవర్గంలో వివిధ రకాలైన సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే, నగరిలో వైకాపా శ్రేణులు రెండు వర్గాలుగా చీలిపోయారు. దీంతో ఇక్కడ పార్టీ తరపున ఏ కార్యక్రమం చేపట్టాలన్నా పెద్ద ఘర్షణ వాతావరణమే నెలకొంటుంది. తాజాగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఇదే జరిగింది.
ఎమ్మెల్యే రోజాతో పాటు ఆమె వ్యతిరేక వర్గం పోటాపోటీగా జగన్ పుట్టిన రోజు వేడుకలు చేయడానికి సిద్ధమయ్యారు. నగరిలో రోజా పదివేల మందితో భారీ ర్యాలీకి సిద్ధంకాగా, రోజా వ్యతిరేకవర్గం కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అంతే ధీటుగా ర్యాలీకి సిద్ధమైంది. దీంతో పార్టీకి చెందిన కిందిస్థాయి కేడర్, కార్యకర్తలు ఎవరి వైపు వెళ్లాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
సోమవారం జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ నగరి పట్టణంలోని ప్రధాన సెంటరులో కట్టిన ఫ్లెక్సీని చింపివేయడంతో రెండు వర్గాల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. దీంతో నగరి పట్టణ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు భద్రతను పెంచి బందోబస్తును ఏర్పాటు చేశారు.