గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 9 ఫిబ్రవరి 2023 (13:23 IST)

నారా లోకేశ్‌పై పోలీసుల ఫిర్యాదు.. క్రిమినల్ కేసు నమోదు

nara lokesh
'యువగళం' పేరుతో పాదాయాత్ర కొనసాగిస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై చిత్తూరు జిల్లా పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. నారా లోకేశ్ తన గురువారం తన పాదయాత్రను గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని సంసిరెడ్డిపల్లిలో కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో ఉద్రిక్త నెలకొంది. 
 
స్టూల్‌పైకి ఎక్కి లోకేశ్ మాట్లాడుతుండగా ఆ స్టూల్‌ను పోలీసులు లాక్కొనేందుకు ప్రయత్నం చేశారు. అలాగే, లోకేశ్ వద్దకు మైక్ తీసుకొస్తున్న బాషా అనే కార్యకర్తను పోలీసులు అడ్డుకుని మైకా లాక్కున్నారు. దీంతో పోలీసులపై లోకేశ్, టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లోకేశ్ మాత్రం స్టూల్‌పైనే నిలబడి భారత రాజ్యాంగ పుస్తకాన్ని పోలీసులకు చూపిస్తూ నిరసన తెలిపారు. 
 
ఇదిలావుంటే, నారా లోకేశ్‌పై పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై చిత్తూరు జిల్లా నర్సింగరాయపేట పోలీస్ స్టేషనులో క్రిమినల్ కేసు నమోదైంది. ఐపీఎస్ 188, 341, 290 రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా సమావేశాన్ని నిర్వహించడం, పాదయాత్రకు ఇచ్చిన అనుమతులను ఉల్లంఘించారంటూ పోలీసులు ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదు చేశారు. 
 
కాగా, చిత్తూరు జిల్లాలో లోకేశ్ పాదయాత్ర ప్రారంభమైన తర్వాత కేసు నమోదు కావడం ఇది ఐదోసారి. అయితే, ఇక్కడ విచిత్రమేమిటంటే పోలీసులు ఫిర్యాదు చేస్తే పోలీసులే కేసు నమోదు చేయడం గమనార్హం.