సీఎం జగన్ పైన సినిమా తీస్తే బొమ్మ 1000 రోజులు ఆడుతుంది, ఎవరు?
ఏదో ఒకటి ఎప్పుడూ మాట్లాడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి. ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టాలనో లేకుంటే మరేమిటో తెలియదు కానీ మొత్తం మీద అడ్డంగా బుక్కయ్యారు ఉపముఖ్యమంత్రి.
ఈసారి సినీప్రముఖులపై వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. సినిమా హీరోలు స్వార్థం చూసుకుంటారు. వారి స్వార్థం కారణంగా ఎంతోమంది నష్టపోతుంటారు. కోట్లాదిరూపాయల రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు ప్రజలకు ఉపయోగపడే ఒక్క పనైనా చేశారా అంటూ ప్రశ్నించారు నారాయణస్వామి.
సినీ నిర్మాతలు నష్టపోతే హీరోలెప్పుడైనా ఆదుకున్నారా అంటూ ప్రశ్నించారు. భీమ్లా నాయక్ సినిమాను పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం వారు మాత్రమే చూశారని, ఆ వర్గం వారు చూడటంతోనే మూడురోజుల పాటు సినిమా హౌస్ ఫుల్ అయ్యిందన్నారు.
అసలు సిఎం జగన్ పేదల పాలిట నిజమైన హీరో అన్నారు. సిఎం జగన్ పైన సినిమా తీస్తే బొమ్మ వెయ్యిరోజులు ఆడుతుందన్నారు డిప్యూటీ సిఎం నారాయణస్వామి. తెలిసీ తెలియకుండా జనసైనికులు నోరు పారేసుకోవద్దని హితవు పలికారు నారాయణస్వామి.