మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 26 మే 2019 (12:27 IST)

సర్.. గెలిపించారు సరే... ఇపుడు గట్టెక్కించాల్సింది మీరే.. మోడీతో జగన్ భేటీ

ప్రధాని నరేంద్ర మోడీతో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆదివారం ఉదయం సమావేశమయ్యారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్న జగన్.. విమానాశ్రయంలో దిగగానే నేరుగా లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధాని నివాసానికి చేరుకున్నారు.
 
సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ఘన విజయం సాధించిన మోడీని అభినందించిన అనంతరం తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు. ప్రధానితోనే ఆయన గంటకు పైగా గడిపారు. ఈ సందర్భంగా పలు అంశాలు వారిమధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. 
 
అలాగే, తన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా మోడీని జగన్ ఆహ్వానించారు. జగన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఈ నెల 30వ తేదీన విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరుగనుంది. 
 
ప్రధానితో జరిగిన చర్చల్లో ప్రధానంగా విభజన హామీలు, ప్రత్యేక హోదా, రాష్ట్ర సమస్యలను ఆయన ప్రధాని దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. జగన్‌ వెంట సీఎస్‌ ఎల్‌.వి. సుబ్రహ్మణ్యం, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, పలువురు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ప్రధానితో సమావేశం ముగిశాక ఆంధ్రాభవన్‌కు వెళ్లనున్న జగన్‌ అక్కడ ఆంధ్రాక్యాడర్‌ ఐఏఎస్‌ అధికారులతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత ఆయన నేరుగా తిరుపతికి చేరుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.