మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (10:08 IST)

సీఎం చంద్రబాబు వల్లే ఆ ఇద్దరూ చనిపోయారు : పవన్ కళ్యాణ్

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హతమార్చడానికి ప్రధాన కారణంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు.

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హతమార్చడానికి ప్రధాన కారణంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అక్రమ బాక్సైట్ తవ్వకాలను నిలిపివేసివుంటే ఆ ఇద్దరు నేతలు నక్సల్స్ తూటాలకు బలయ్యేవారు కాదని ఆయన వ్యాఖ్యానించారు.
 
ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మావోలు హత్య చేయడంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. అరకు నియోజకవర్గంలోకి వచ్చే గూడ గ్రామంలో జరుగుతున్న అక్రమ క్వారీ తవ్వకాలపై ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉండాల్సిందన్నారు. ప్రభుత్వం అలా స్పందించి ఉంటే నేడు ఎమ్మెల్యేని, మాజీ ఎమ్మెల్యేని కోల్పోవాల్సి వచ్చుండేది కాదని అన్నారు. 
 
తన ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా అరకులోని గూడ గ్రామాన్ని సందర్శించినట్టు చెప్పారు. ఆ సమయంలో అక్కడ క్వారీల తవ్వకాల వల్ల కలుషితమైన తాగునీటిని గ్రామస్తులే పవన్ కళ్యాణ్‌కు చూపించారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పర్యావరణానికి హానిచేస్తున్న అక్రమ క్వారీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.