1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 మే 2024 (22:54 IST)

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

pratap kumar reddy
నెల్లూరు జిల్లా కావలి నియోజవర్గంలో ఆసక్తికర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ నెల 13వ తేదీన ఏపీలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌తో పాటు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో కావలి నియోజవర్గ వైకాపా అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే, ఆయన పొరపాటున టీడీపీ - బీజేపీ - జనసేన కూటమి అభ్యర్థికి ఓటు వేశారు. ఈ విషయాన్ని ఆయన గ్రహించేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 
 
నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వైకాపా తరపున విజయసాయి రెడ్డి బరిలో ఉన్నారు. అయితే, పోలింగ్ రోజున వైకాపా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప రెడ్డి పొరపాటున టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేశారు. పోలింగ్ సిబ్బందికి అభివాదం చేస్తూ పొరపాటుగా సైకిల్ గుర్తు బటన్‌ను నొక్కారు. ఆ వెంటనే తాను చేసిన పొరపాటును గ్రహించి పోలింగ్ సిబ్బందికి విషయం తెలుపడంతో, తామేం చేయలేమని సిబ్బంది చెప్పారు. ఇక చేసేదేం లేక ఆయన బయటకు వచ్చినట్టు తెలిసింది. అయితే, ఈ ఘటన ఆలస్యంగా వచ్చింది.