మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 డిశెంబరు 2019 (11:09 IST)

తుగ్లక్ పాలనలా వుంది... విశాఖను ఎవరు అడిగారు : మైసూరా రెడ్డి

మూడు రాజధానుల అంశాన్ని రాయలసీమ ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి, సీనియర్ నేత ఎంవీ మైసూరా రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. తుగ్లక్ పాలనా ఉందంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. అసలు విశాఖపట్టణం ప్రాంతాన్ని రాజధానిని చేయాలని ఎవరు అడిగారంటూ ఆయన నిలదీశారు. 
 
ఇదే అంశంపై మైసూరా రెడ్డి మాట్లాడుతూ, రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని ఎప్పటినుంచో అడుగుతున్నా, ప్రభుత్వం ఎందుకు విశాఖ వైపు మొగ్గుచూపిందని నిలదీశారు. విశాఖలో అభివృద్ది జరిగిందని సీఎం జగన్ కూడా అంగీకరించాడని, అలాంటప్పుడు విశాఖలో కొత్తగా రాజధాని ఏర్పాటుచేసి ఏం సాధిస్తారని ఆయన నిలదీశారు. 
 
ఏమీ అడగని వాళ్లకు రాజధాని ఇస్తున్నారని విమర్శించారు. రాజధానిని ముక్కలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంటే రాయలసీమకు రావాల్సిన వాటా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. హైకోర్టును రాయలసీమకు ఇవ్వడం న్యాయమైన వాటా అనిపించుకోదని, హైకోర్టుతో ఎంతమందికి అవసరం ఉంటుందని అన్నారు. 
 
మరోవైపు, రాజధాని తరలింపును అమరావతి ప్రాంత రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఫలితంగా ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫలితంగా భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించారు. సచివాలయానికి వెళ్లే ప్రధాన రహదారి కావడంతో మందడం వద్ద పరిస్థితి మరింత ఆందోళనకరంగా కనిపిస్తోంది. ఈ ప్రాంతంలోని రహదారిపై గత రాత్రి టైర్లను కాల్చి పడవేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, వాటిని ఆర్పివేసేందుకు శ్రమించాల్సి వచ్చింది. వెలగపూడి, కృష్ణాయపాలెంలో రైతుల రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి.