రఘురామ అరెస్ట్ తీరుపై ఎన్‌హెచ్ఆర్సీ సీరియస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా పార్టీకి చెందిన నర్సాపురం రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్టు తీరుపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్సీ) సీరియస్ అయ్యింది. ఏపీ డీజీపీ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలకు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు జారీ చేసింది.
4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కస్టడీలో రఘురామపై పోలీసుల దాడికి సంబంధించి.. అంతర్గత విచారణ చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొంది. జూన్ 7లోగా నివేదిక డీజీని ఆదేశించింది. రఘురామ అరెస్టు తీరుపై ఎన్‌హెచ్‌ఆర్సీకి కుమారుడు భరత్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఇదిలావుంటే, బెయిల్‌పై విడుదలైన ఎంపీ రఘురామ ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరింది. అక్కడ ఆయన్ను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎయిమ్స్ వైద్యులకు సూచించారు.
బెయిల్‌పై విడుదలైన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేయించారు. ఆయన కాళ్లలో కణజాలం తీవ్రంగా దెబ్బతిన్నట్టు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. రఘురామ రెండు కాళ్లకు కట్లు కట్టిన ఎయిమ్స్ డాక్టర్లు రెండు వారాల విశ్రాంతి తప్పనిసరి అని స్పష్టం చేశారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ నడవొద్దని తేల్చిచెప్పారు. ప్రస్తుతం రఘురామరాజు ఎయిమ్స్ నుంచి డిశ్చార్జి అయిన అనంతరం ఢిల్లీలోని తన నివాసానికి చేరుకున్నారు. రాజద్రోహం ఆరోపణలపై రఘురామ కృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే.
అయితే కస్టడీలో తనను దారుణంగా కొట్టారంటూ రఘురామ ఆరోపించడంతో కోర్టు వైద్య పరీక్షలకు ఆదేశించింది. ఆర్మీ ఆసుపత్రి వైద్య పరీక్షల్లో ఆయన కాలి వేలు ఫ్రాక్చర్ అయినట్టు వెల్లడైంది.
ఇక, సుప్రీంకోర్టు ఆయనకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స అందించాలని ఆదేశించింది. ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందిన రఘురామకు ఇటీవలే బెయిల్ మంజూరైంది. ఈ కేసు గురించి, ఆరోగ్య పరిస్థితి గురించి మీడియాతో ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడవద్దని న్యాయస్థానం రఘురామను ఆదేశించింది.