శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 మే 2021 (13:37 IST)

రఘురామపై సీఐడీ కొత్త వాదన : కస్టడీలోనే గాయాలయ్యానికి ఆర్మీ ఆస్పత్రి చెప్పలేదు

వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు రెండు కాళ్ళకు అయిన గాయాలపై ఏపీ సీఐడీ పోలీసులు సరికొత్తవాదనను తెరపైకి తెచ్చారు. రఘురామకు పోలీసు కస్టడీలోనే గాయాలు అయ్యాయని కానీ, ఆయనకు గాయాలు ఉన్నాయని కానీ సికింద్రాబాద్ సైనిక ఆసుపత్రి ఎక్కడా చెప్పలేదని సీఐడీ అధికారులు అంటున్నారు. అందువల్ల ఇందుకు విరుద్ధంగా చెప్పడం సబబు కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
సుప్రీంకోర్టుకు సైనిక ఆసుపత్రి సమర్పించిన నివేదికలోనూ ఇదే విషయాన్ని పేర్కొందని గుర్తు చేసిన సీఐడీ పోలీసులు.. సైనిక ఆసుపత్రి నివేదికకు ముందే మూడుసార్లు వైద్యులు పరిశీలించి నివేదిక ఇచ్చారని, వాటిలో రఘురామకు గాయాలు అయినట్టు ఎక్కడా చెప్పలేదని గుర్తచేశారు. 
 
అలాగే, రఘురామను గుంటూరు సీఐడీ కోర్టులో హాజరుపరచడానికి ముందు జారీ చేసిన ఫిట్నెస్ ధ్రువపత్రం, గుంటూరు జీజీహెచ్ వైద్యుల బృందం హైకోర్టుకు ఇచ్చిన నివేదిక, గుంటూరు జిల్లా జైలు డ్యూటీ డాక్టర్ ఇచ్చిన నివేదికలోనూ ఎక్కడా రఘురామకు గాయాలు ఉన్నట్టు పేర్కొనలేదని తెలిపారు. 
 
సికింద్రాబాద్ సైనిక ఆసుపత్రి కూడా ఇదే విషయాన్నిచెప్పిందని, ఆయనకు ఎడిమా ఉందని తప్పితే కస్టడీలోనే గాయాలు అయినట్టు ఎక్కడా పేర్కొనలేదని వివరించింది. కాబట్టి గాయాలు ఉన్నట్టు సైనికాసుపత్రి ధ్రువీకరించిందని చెప్పడం, మీడియాలో వార్తలు ప్రసారం చేయండ సరికాదని సీఐడీ అధికారులు అభిప్రాయపడుతున్నారు.