శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 30 అక్టోబరు 2024 (17:43 IST)

కర్నూలు మార్కెట్లో కుప్పలుతెప్పలుగా ఉల్లి, రైతు ధర కిలో రూ. 15, ప్రజలకు రూ. 50

onions
కర్నూలు మార్కెట్లోకి ఉల్లిపాయలు కుప్పలుతెప్పలుగా వచ్చి చేరుతున్నాయి. ఉల్లి కొనుగోలు చేసిన వ్యాపారులు వాటిని తరలించడంలో జాప్యం చేస్తున్నారు. ఉల్లిని ఎగుమతి చేసుకునేందుకు తమకు లారీలు దొరకడంలేదని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు మార్కెట్టుకి రైతులు తమ ఉల్లి దిగుబడితో భారీ సంఖ్యలో వస్తున్నారు. ఇదే అదనుగా దళారులు రైతుల జేబులకు చిల్లులు పెట్టే పని ప్రారంభించారు. రైతుల నిస్సహాతను ఆసరాగా చేసుకుని రైతులకి కిలోకి రూ. 15కే దోచేస్తున్నారు.
 
ఇదంతా అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉల్లిని విక్రయించుకునేందుకు మార్కెట్టుకి వచ్చిన రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. దీనితో ఉల్లిపాయల్లో తరుగు కింద క్వింటాళ్ల లెక్కన పోతోంది. ఈ తలనొప్పి భరించలేని రైతులు అయినకాడికి అమ్ముకుని వెళ్లిపోతున్నారు. రైతుల నుంచి కిలో ఉల్లిపాయలను రూ. 15కి కొంటుండగా అవి వినియోగదారుడికి చేరేసరికి కిలోకి రూ. 50 అవుతోంది. ఇంత భారీ అంతరం కళ్లకు కట్టినట్లు కనబడుతున్నా అధికారులు పట్టిపట్టనట్లు వ్యవహరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.