మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 27 ఏప్రియల్ 2019 (11:26 IST)

ఒకవైపు ఫణి వచ్చేస్తోంది.. మరోవైపు ఎండలు వాయిస్తున్నాయి...

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం 29వ తేదీ నాటికి ఇది మరింత బలపడి 30వ తేదీ నాటికల్లా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.


అయితే, అది దిశను కూడా మార్చుకునే అవకాశాలున్నాయని వివరించింది. కోస్తాంధ్ర తీరం వెంబడి ఇది ప్రయాణించే అవకాశాలు ఉన్నప్పటికీ ఏపీ తీరం తాకే అవకాశాలు లేవని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  
 
మచిలీపట్టణానికి 1690 కిలోమీటర్ల దూరంలో, శ్రీలంకలోని ట్రింకోమలికి 1060 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 1410 కిలోమీట్ల దూరంలో  వాయుగుండం కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు. అది కాస్త తీవ్ర వాయుగుండంగా మారి, 5:30 గంటల ప్రాంతంలో తుపానుగా మారినట్టు తెలిపారు. 29న అది తీవ్ర తుపానుగా మారుతుందని, దీని ప్రభావంతో 30న దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.  
 
ఈ వాయుగుండం ప్రభావంతో గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ తీరాన్ని తాకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ తుపానుకు ‘ఫణి’ అని పేరు పెట్టారని తెలుస్తోంది. తుపాను నేపథ్యంలో జాలర్లు వేటకు వెళ్లొద్దని, ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు ఆదివారం లోగా తీరానికి చేరుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
 
అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ‘ఫణి’ తుపాన్‌గా మారి కోస్తా తీరంవైపు దూసుకు వస్తున్న విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం, సోమవారం వడగాల్పులు వీచే అవకాశం ఉందని, బయట తిరిగే వారు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.  ముఖ్యంగా ఉత్తర భారత దేశం నుంచి వీస్తున్న పొడిగాలుల కారణంగా తెలంగాణలో వడగాల్పుల ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. 
 
ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు భానుడి ప్రతాపానికి తట్టుకోలేక నానా తంటాలు పడుతున్నారు. తెలంగాణ, రాయల సీమ నిప్పుల కొలిమిలా మారాయి.  పగటి ఉష్ణోగ్రతలు ఏకంగా 45 డిగ్రీలకు చేరుకోవడంతో హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం అత్యధికంగా నిజామాబాద్ జిల్లా కోరట్‌పల్లి, మంచిప్పలలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.