శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 5 అక్టోబరు 2018 (12:36 IST)

తమిళనాడుకు రెడ్ అలెర్ట్.. ఏడో తేదీ ఏమౌతుందో? 25 సెం.మీల వర్షపాతమా?

తమిళనాడుకు వాతావరణ శాఖాధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. తమిళనాడులో ఏడో తేదీన అత్యంత భారీ వర్షం పడొచ్చన్న అంచనాలతో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. తక్కువ సమయంలో అత్యధిక వర్షం కురవడాన్నే ''రెడ్‌ అలర్ట్''గా

తమిళనాడుకు వాతావరణ శాఖాధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. తమిళనాడులో ఏడో తేదీన అత్యంత భారీ వర్షం పడొచ్చన్న అంచనాలతో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. తక్కువ సమయంలో అత్యధిక వర్షం కురవడాన్నే ''రెడ్‌ అలర్ట్''గా వ్యవహరిస్తుంటారని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.


అందుచేత ఏడో తేదీన (ఆదివారం) దాదాపు 25 సెం.మీల వర్షపాతం నమోదు కావొచ్చని విపత్తు నిర్వహణ విభాగం అధికారులు మీడియాతో తెలిపారు.  ఇందులో భాగంగా ముందస్తు హెచ్చరిక పనులు చేపట్టాలని, సహాయక శిబిరాలు సిద్ధంగా ఉంచాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు విపత్తు నిర్వహణ విభాగం ఆదేశించింది. 
 
ఇప్పటికే తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని చెన్నై సహా కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లోని అనేక ప్రాంతాలు భారీ వర్షాల కారణంగా అతలాకుతలమవుతున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో వచ్చే రెండు రోజుల్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం హెచ్చరించింది. 
 
ఈ నెల 7వ తేదీన అత్యంత భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. ఆ తర్వాత మూడు రోజులు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గత నెలలో కేరళలో భారీ వర్షాలు సృష్టించిన విలయం నేపథ్యంలో తమిళనాడు సర్కారు అప్రమత్తమైంది. గత అనుభవాల దృష్ట్యా ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు జాగత్ర చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి పళనిస్వామి ఆదేశాలు జారీచేశారు.
 
చెన్నైతో పాటు రాష్ట్రంలోని పుదుకోట్టై, తిరుచ్చి, తంజావూరు, ధర్మపురి, శివగంగై, దిండుకల్‌, మదురై, నామక్కల్‌, తిరువారూర్‌ తదితర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గురువారం భారీవర్షం కురిసింది. వేలూరు జిల్లాలో అరక్కోణం, కాంచీపురం జిల్లాలో తిరుపోరూర్‌, కల్పాక్కం, మహాబలిపురం తదితర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉద్ధృతమైన గాలులు వీయడంతో సముద్రం కల్లోలంగా మారింది. దీంతో రామేశ్వరం, మండపం, పాంబన్‌ తదితర ప్రాంతాలకు చెందిన జాలర్లు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లడం లేదు.