త్వరలో పోలవరం బ‌కాయి నిధులు విడుద‌ల

polavaram dam
ఎం| Last Updated: మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (18:14 IST)
పోలవరం బ‌కాయి నిధులు త్వరలో విడుద‌ల చేస్తామ‌ని కేంద్రం హామీ ఇచ్చిన‌ట్లు రాష్ట్ర నీటిపారుద‌ల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీకి ఒకరోజు పర్యటన నిమిత్తం వెళ్లిన‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల మ‌రియు నీటివనరుల అభివృద్ధి శాఖా మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిశారు.

మంత్రితో పాటు ఏపి నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాద్ దాస్, పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి, గోరంట్ల మాధవ్, లావు శ్రీకృష్ణదేవరాయలు సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రితో జరిగిన సమావేశంలో పోలవరం ప్రాజెక్టుకు సంబందించిన బకాయిలు, పునరావాసం ప్యాకేజీ నిధులు, పోలవరం ప్రాజెక్టు రీయింబర్స్‌మెంట్ నిధులు త్వరితగతిన విడుదల చేయాలని కోరినట్లు మంత్రి అనీల్‌కుమార్ యాద‌వ్ తెలిపారు.

కృష్ణా ప్రాజెక్టుల వల్ల రాయలసీమకు జరిగే ప్రయోజనాలను గురించి కూడా
వివరించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో చేపట్టబోతున్న ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని కోర‌గా అందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.

రాష్ట్రానికి అన్ని విధాలా కేంద్ర సహకారం ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు చెప్పమని కేంద్రమంత్రి అన్నట్లు మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ విలేఖరులకు చెప్పారు. కరోనా నేపథ్యంలో కొంత జాప్యం జ‌రిగింద‌ని, త్వరలోనే నిధులు విడుదల చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.

వ‌రదల సమయంలోనూ పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నారని, 2021 డిసెంబర్ నాటికల్లా పోలవరం
పూర్తి చేయాలని ముఖ్యమంత్రి లక్ష్యమని గజేంద్ర సింగ్ షెకావత్‌కు విన్నవించినట్లు మంత్రి తెలిపారు.

ఆర్ అండ్ ఆర్ పనులు వేగంగా జరుగుతున్నాయని, కేంద్రం నుంచి త్వరితగతిన నిధులు వస్తే ఆ పనులు మరింత వేగంగా పూర్తవుతాయని కేంద్ర మంత్రికి వివరించామ‌న్నారు.

రూ.4వేల కోట్ల పోలవరం బకాయిలు త్వరలో విడుదల చేస్తామని, అపెక్స్ కౌన్సిల్ సమావేశం తేదీని కూడా త్వరలోనే నిర్ణయిస్తామని కేంద్ర మంత్రి చెప్పినట్లు, ఈ అంశాలను సానుకూలంగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు.

కరోనా కారణంగా అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ వాయిదా పడింద‌ని, ఎప్పుడు మీటింగ్ జరిగినా రాష్ట్ర వాదనను సీఎం జ‌గ‌న్ బలంగా వినిపిస్తారని మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్ పేర్కొన్నారు.
దీనిపై మరింత చదవండి :