సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 19 మార్చి 2022 (22:46 IST)

తానా పౌండేషన్ ఆధ్యర్యంలో 160 మంది విద్యార్ధులకు రూ.18 లక్షల ఉపకార వేతనాలు

ఆర్థిక స్థోమతలేక ఉన్నత విద్యకు దూరం అవుతున్న విద్యార్ధులకు ప్రతి ఒక్కరూ తమ వంతు సాయం అందించాలని గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా సూచించారు. మంచి తెలివి తేటలు ఉన్నప్పటికీ వనరుల కొరతతో పలువురు విద్యార్దులు పాఠశాల విద్యతోనే ముగింపు పలుకుతున్నారని ఆందోళన వ్యక్తం చేసారు.

 
చేయూత పేరిట తానా పౌండేషన్ అందిస్తున్న ఉపకార వేతనాల పంపిణీ విజయవాడ హోటల్ ఇంద్రప్రస్ధ వేదికగా శనివారం ఘనంగా నిర్వహించారు. తానా పౌండేషన్ కార్యదర్శి శశికాంత్ వల్లేపల్లి నేతృత్వంలో దాదాపు 160 మంది విద్యార్దులకు రూ.18 లఃక్షల ఉపకార వేతనాలను చెక్కుల రూపంలో పంపిణీ చేసారు.

 
కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన సిసోడియా మాట్లాడుతూ నిజానికి భారత దేశంలో ఉన్నత చదువులు అభ్యసించి విదేశాలలో స్ధిర పడి ఆర్ధికంగా ఉన్నత స్ధానాలలో ఉన్న పలువురు మాతృభూమిని మరచి పోతున్నారని, అయితే తెలుగు వారు మాత్రం అందుకు మినహాయింపుగా కనిపిస్తున్నారన్నారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా జన్మభూమిని మరిచిపోరని కితాబు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో విద్య, వైద్యం విభాగాలలో ప్రవాస భారతీయులు మరింతగా తమ సహకారాన్ని అందించాలని సిసోడియా కోరారు.

 
విశిష్ట అతిధి, మాజీ డిజిపి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ విద్యాదానాన్ని మించిన దానం మరొకటి లేదని, ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన తానా పౌండేషన్ నిర్వాహకులు అభినందనీయులన్నారు. తానా పౌండేషన్ కార్యదర్శి శశికాంత్ వల్లేపల్లి మాట్లాడుతూ తానా చేయూత కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం 1000 నుంచి 1500  విద్యార్థులకు ఉపకార వేతనాలు  పంపిణీ చేస్తున్నామన్నారు. ఫౌండేషన్ ద్వారా రూ.400 కోట్లు విలువైన సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వచ్చే ఏడాది వచ్చే సంవత్సరం ఉపకార వేతనాల సంఖ్యను రెండు వేలకు పెంచనున్నామన్నారు. 

 
ప్రధానంగా విద్యార్ధులు చదువుతో పాటు కమ్యూనికేషన్స్ నైపుణ్యాలను  పెంచుకోవాలన్నారు. తద్వారా వారికి ఉజ్వల భవిష్యత్తు, మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, గుంటూరు జిలా పరిషత్తు మాజీ ఛైర్మన్ పాతూరి నాగభూషణం మాట్లాడుతూ విద్యాదానం కొన్ని తరాల ఉన్నతికి దోహదపడుతుందన్నారు. తానా పౌండేషన్ చేపడుతున్న సేవలు అభినందనీయమన్నారు. తానా పౌండేషన్ ఇండియా ట్రస్టీ, కార్యదర్శి అచార్య కెఆర్ కె ప్రసాద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.