శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (08:29 IST)

ఏపీ సర్కారుకు నిమ్మగడ్డ తీవ్ర హెచ్చరిక : తీవ్ర పరిణామాలు తప్పవంటూ...

ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గట్టిగా హెచ్చరించారు. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌ను తన ఆదేశాల మేరకు బదిలీ చేయకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇదే అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
ఎన్నికల సంఘం ఆదేశాలను అమలు చేయకుండా ఉండేందుకు.. సీఎస్‌కు ఏ విధమైన విచక్షణాధికారం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల్ని సీఎస్ ఉద్దేశపూర్వకంగానే ధిక్కరించినట్లు భావించాల్సి ఉంటుందని, దానికి తగిన పరిణామాలూ ఉంటాయని తెలిపారు. ఈ మేరకు ఎస్ఈసీ శనివారం సీఎస్‌కు లేఖ రాశారు. 
 
"ఎస్ఈసీకి ప్రభుత్వం సహకారం అందించాలని హైకోర్టు ఆదేశించింది. దానికి కట్టుబడి ఉంటామని మీకంటే ముందు ప్రధాన కార్యదర్శిగా ఉన్న అధికారి హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. ప్రస్తుత వ్యవహారంలో మీ వైఖరి హైకోర్టు, ఎన్నికల సంఘం ఆదేశాల్ని ధిక్కరించేలా ఉంది" అని రమేశ్ కుమార్ పేర్కొన్నారు. 
 
"ప్రభుత్వం సహకరించనందుకు ఎస్ఈసీ దాఖలుచేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ కోర్టులో పెండింగులో ఉంది. ప్రస్తుత వ్యవహారానికి సంబంధించిన పూర్తి వాస్తవాల్ని, మన మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను, మీ వైఫల్యాలను కూడా కోర్టుముందు ఉంచాల్సి వస్తుంది" అని ఆయన తెలిపారు. 
 
"కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ తలపెట్టిన వీడియో సమావేశాన్ని.. పంచాయతీ ఎన్నికలపై యథాతథ స్థితి కొనసాగించేందుకు తానే అడ్డుకున్నానని ప్రవీణ్ ప్రకాష్ అంగీకరించారు. ఆయనిచ్చిన ఉత్తర్వుల వల్లే తొలిదశ పంచాయతీ ఎన్నికలకు విఘాతం కలిగింది. తప్పు చేసిందే కాకుండా, దాన్ని ప్రవీణ్ ప్రకాష్ సమర్థించుకున్నారు. తాను తప్పు చేశానన్న పశ్చాత్తాపం కూడా ఆయనలో లేదు. తప్పు చేశానని అంగీకరించిన తర్వాత కూడా.. ఆయనను అదే పోస్టులో కొనసాగిస్తే స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకు విఘాతంగా మారుతుంది" అని రమేష్ కుమార్ రాసిన లేఖలో పేర్కొన్నారు.