గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 22 నవంబరు 2019 (07:49 IST)

ఒక్క సెకనులో 15 ముఖాలను గుర్తించగల స్మార్ట్ గ్లాసెస్

పరిశ్రమలు,ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని రష్యాకి చెందిన ఎన్ఎన్ టీసీ సాఫ్ట్ వేర్ కంపెనీ ప్రతినిధుల బృందం సమావేశమైంది. సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో కళ్లకు స్మార్ట్ గ్లాసెస్ ధరించి మనుషుల ముఖాన్ని గుర్తించే సరికొత్త టెక్నాలజీని మంత్రి ఆసక్తిగా పరిశీలించారు.

కళ్లద్దాల్లో అమర్చిన కెమెరా సహాయంతో ముఖాన్ని గుర్తించే టెక్నాలజీ ఆధారంగా నేరాల నియంత్రణ సాధ్యమని మంత్రి వెల్లడించారు. ఈ టెక్నాలజీ శాంతిభద్రతలను కాపాడే పోలీస్ శాఖకు ఎంతో ఉపయోగకరమని అభిప్రాయపడ్డారు. కళ్లద్దాలకు కుడివైపున ఉన్న మీటను స్పృశించి ఫేస్ డిటెక్షన్ చేశారు.

ఒకేసారి ఎన్ని ముఖాలను గుర్తించగలదో ఎన్ఎన్టీసీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఎర్రచందనం స్మగ్లర్లను గుర్తించి పట్టుకునేందుకు కూడా  ఉపయోగపడుతుందని డీఐజీ పాల్ రాజు అన్నారు. అయితే, ముఖ్యమంత్రి సభలు, ప్రభుత్వ కార్యక్రమాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, క్రికెట్ స్టేడియం వంటి జనాభా అధికంగా ఉన్న చోట మరింతగా వినియోగించుకోవచ్చని మంత్రి వ్యాఖ్యానించారు.

ముఖ్యంగా తీవ్రవాదులు, నక్సలైట్లను గుర్తించడంలోనూ ఈ స్మార్ట్ గ్లాసెస్ ఉపయోగపడతాయన్నారు. అయితే డేటా బేస్ లో అనుమానితులు, ఖైదీల ఫోటోలు ముందే పొందు పరచుకోవాల్సిన అవసరముందని ప్రతినిధులు తెలిపారు. డేటా మొత్తాన్ని పోల్చి చూసి డేటా బేస్ లో ఉన్న ముఖం ఎదురుగా గుర్తించిన ముఖం ఒకటే అయితే వెంటనే గుర్తించడం ఈ స్మార్ట్ గ్లాస్ ప్రత్యేకత అని ప్రతినిధులు వివరించారు.

అవసరాన్ని బట్టి డేటా బేస్ ను పెంచుకోవచ్చని మంత్రి అడిగిన ప్రశ్నకు ప్రతినిధులు బదులిచ్చారు. మొబైల్, కార్లు, బాడీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా ఫేస్ గుర్తించే పరికరాలు ఉన్నట్లు మంత్రికి ప్రతినిధులు తెలిపారు. డీజీపీతో సమావేశమై ప్రజంటేషన్ ఇవ్వమని  ఎన్ఎన్టీసీ ప్రతినిధులకు మంత్రి సూచించారు.

ఉపయోగం, లాభం, నష్టం ఏంటి? ఏపీలో ఈ టెక్నాలజీ వినియోగానికిగల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఫోన్ లోనే డీజీపీతో చర్చించారు. మంత్రి సూచన మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్ తో ఎన్ఎన్ టీసీ ప్రతినిధులు మంగళగిరిలోని పోలీస్ బాస్ కార్యాలయంలో సమావేశమయ్యారు.

పోలీస్ శాఖకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఎంత ఖర్చవుతుంది? ఎలా పని చేస్తుందనే వివరాలపై గౌతమ్ సవాంగ్ ఆరా తీసినట్లు ప్రతినిధులు వెల్లడించారు. ఆసక్తిగా ఉన్న టెక్నాలజీ వల్ల నష్టాలేవైనా ఉన్నాయా? ఖర్చు తగ్గించే వీలుందా? వంటి పూర్తి వివరాలతో త్వరలోనే మరోసారి భేటీ అవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. 

కార్య‌క్ర‌మంలో ఐ.టీ శాఖలో భాగమైన ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ విభాగానికి చెందిన అధికారులు, పోలీస్ శాఖ ఉన్నతాధికారి పాల్‌రాజు, ఎన్ఎన్టీసీతో భాగస్వామ్యమైన స్కోర్ క్లిక్ కంపెనీ సీఈవో సయ్యద్, బిజినెస్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ వసీమ్ అహ్మద్ పాల్గొన్నారు.
 
లూలూ గ్రూప్’పై అంతా అసత్య ప్రచారమే
గత ప్రభుత్వంలో ఒప్పందాలు కుదిరి విశాఖపట్నంలో కన్వెన్షన్ సెంటర్, ఫైవ్ స్టార్ హోటళ్లపై పెట్టుబడులు పెట్టాలనుకున్న లూలూ గ్రూప్ భవిష్యత్‌లో పెట్టుబడులు పెట్టదని ప్రకటించినట్లు మీడియాలో వస్తున్న కథనాలపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు.

పత్రికాప్రకటన, మెయిల్ వంటి అధికారిక ప్రకటనలు లేకుండా జరుగుతున్న అసత్య కథనాలు, ప్రచారాన్ని మంత్రి ఖండించారు. గత ప్రభుత్వం హయాంలో 2018 ఫిబ్రవరిలో లూలూ ఒప్పందం కుదుర్చుకుందని మంత్రి వెల్లడించారు. ఆ లూలూ ప్రాజెక్టుకు కేటాయించిన 13.83 ఎకరాల భూమి కేసుల్లో ఉందని,  న్యాయపరమైన చిక్కులున్న భూమిని అప్పగించడంపై  నాటి ఏపీఐఐసీ ఎండీ రాసిన లేఖను గురించి  మంత్రి ప్రస్తావించారు.

ముఖ్యమంత్రి మొదటి నుంచి చెబుతున్నట్లు పారదర్శక పాలనకే పెద్దపీట వేస్తున్నామన్నారు. పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని ప్రచారాలు, కథనాలు రాసినా అబద్ధాలు నిజం కాబోవన్నారు మంత్రి గౌతమ్ రెడ్డి.  తప్పును తప్పని చెప్పకుండా అదే తప్పుదారిలో వెళ్లడం సరైంది కాదని, అందుకే గత ప్రభుత్వంలోని ఇష్టారీతిన జరిగిన లోపాయికారి ఒప్పందాలను ప్రజల ముందు ఉంచడానికి ప్రయత్నిస్తున్న‌ట్లు తెలిపారు.

సచివాలయంలోని ప్రచారవిభాగంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ..లూలూ ప్రాజెక్టును ప్రభుత్వం రద్దు చేయడానికి రెండు ప్రధాన కారణాలున్నాయని మంత్రి వివరించారు. లూలూతో ప్రభుత్వం ప్రాజెక్టును రద్దు చేసుకోవడానికి బిడ్డింగ్ లో పారదర్శకత లేకపోవడం మొదటి కారణం కాగా, లూలూకు కేటాయించిన భూమి చాలా విలువ ఉన్నా.. అది చాలా తక్కువ ధరకే అప్పగించడం ప్రజాధనం వృథా చేయడంగా భావించి లూలూతో రద్దు చేసుకున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

లూలూకు కేటాయించిన భూమికి మార్కెట్ విలువ ప్రకారం ప్రస్తుత ధర ఎకరాకు సుమారు రూ. 40-42 కోట్ల వరకూ ఉంటుందని మంత్రి తెలిపారు. అంత విలువైన భూమికి సరిగ్గా లెక్కేస్తే గత ప్రభుత్వ ఒప్పందం ప్రకారం ఒక్కో చదరపు అడుగుకు 5 రూపాయలు కూడా రాదని మంత్రి వ్యాఖ్యానించారు. 

తక్కువ ధరకే అద్దెకు ఇవ్వడం కారణంగా సుమారు 500 కోట్లపైనే  ఏడాదికి ప్రజాధనం వృథా అవుతుందనే కోణంలో ఆలోచించి తమ ప్రభుత్వం లూలూతో గత ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న ప్రాజెక్టును రద్దు చేసుకుందని మంత్రి మేకపాటి వివరించారు. గత ప్రభుత్వం రూ.2200 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని పత్రికల్లో వార్తలకోసం చేసిన ఆర్భాటపు ప్రచారాల వల్లే ఇదంతా జరిగిందన్నారు మంత్రి.

గత ప్రభుత్వం హయాంలో ఒప్పందం చేసుకుని తర్వాత కూడా అదే ప్రభుత్వం సంవత్సరకాలం వరకూ పాలన కొనసాగినా లూలూ ఏ పనులు చేపట్టకపోయినా చర్యలు తీసుకోలేకపోయిందన్నారు. ఇదంతా కేవలం గత ప్రభుత్వ తప్పిదం, నిర్లక్ష్యం వల్లే జరిగిందన్నారు. ఏపీఐఐసీలో ప్రస్తుతం ఎంతో టెక్నాలజీ ఉందని, అది వినియోగించుకుని అధునాతన భవనాలు నిర్మించగలమని మంత్రి హైదరాబాద్‌లో నిర్మించిన హైటెక్స్ ఉదాహరణగా చెప్పారు. 
 
‘వీరా వాహన ఉద్యోగ ప్రైవేట్ లిమిటెడ్’తో ఒప్పందం...
రూ.1000 కోట్ల పెట్టుబడులతో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ అయిన ‘వీరా వాహన ఉద్యోగ ప్రైవేట్ లిమిటెడ్’ అనంతపురంలో రాబోతుందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే అందుకు సంబంధించిన ఒప్పందం పూర్తయిందని మంత్రి తెలిపారు.

120 ఎకరాల్లో ఏర్పాటు కానున్న మానుఫాక్చరింగ్ యూనిట్‌లో ఏడాదికి 3వేల ఎలక్ట్రిక్ బస్సులు తయారు కానున్నాయని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ఆదాయం కోల్పోని విధంగా చాలా తక్కువ మొత్తాన్ని ప్రోత్సహకాలుగా ఇవ్వనున్నామని మంత్రి తెలిపారు.

విద్యుత్ రాయితీలు, నీటి సరఫరా వంటి మౌలిక వసతుల కల్పనలో కూడా పరిమితులకు లోబడి ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి మేకపాటి స్పష్టం చేశారు.