శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 6 ఏప్రియల్ 2019 (16:12 IST)

చంద్రబాబు ఒక్కరే మోదీపై పోరాటం చేస్తుంటే.. జగన్, కేసీఆర్‌లు? వీహెచ్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు.. ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. హైదరాబాదులోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉగాది రోజున వీహెచ్ మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారని.. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆయన్ని టార్గెట్ చేసిందని వీహెచ్ విమర్శించారు. 
 
ఎన్నికల సంఘం కక్ష్యసాధింపు చర్యలు చేపట్టడం కూడా అందులో భాగమేనని చెప్పారు. ఎన్నికలకు నాలుగురోజుల ముందు సీఎస్‌ను మార్చడం దేనికి సంకేతమని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం ఇంతలా దిగజారి ప్రవర్తించడాన్ని తానెప్పుడూ చూడలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో ఎన్నికల సమయంలో మాత్రం ఏపీ తరహాలో అధికారులను ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు. 
 
ఫెడరల్ ఫ్రంట్ పేరుతో మోదీని బయట తిడుతున్న కేసీఆర్ లోపల మాత్రం అడ్జస్ట్ మెంట్ అవుతున్నారని విమర్శలు గుప్పించారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో మోదీని ఓవైపు కేసీఆర్ తిడుతుంటే, మరోవైపు వైసీపీ అధినేత జగన్ పొగుడుతున్నారని వ్యాఖ్యానించారు. 
 
ఇది దేనికి సంకేతమని ప్రశ్నించారు. కేంద్రంపై ఒక్క చంద్రబాబు మాత్రమే నిజంగా పోరాడుతున్నారని కితాబిచ్చారు. పాత కేసులను మాఫీ చేసుకునేందుకు వైకాపా చీఫ్ జగన్ మోదీపై ప్రశంసలు కురిపిస్తున్నారని దుయ్యబట్టారు.