సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 27 అక్టోబరు 2021 (22:52 IST)

చంద్రబాబు టెర్రరిస్ట్ అన్న సాయిరెడ్డి వ్యాఖ్యలపై డీజీపీ ఏం సమాధానం చెబుతాడు? : దేవినేని

రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై చంద్రబాబునాయుడు, రాష్ట్రపతిని కలిస్తే విజయసాయిరెడ్డికి, ఏపీ ప్రభుత్వానికి ఎందుకు చలీ, జ్వరం వస్తున్నాయని టీడీపీ సీనియర్ నేత మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు వారి మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...!
 
రాష్ట్ర్రంలో సాగుతున్న అరాచకపాలనను ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు , రాష్ట్రపతి దృష్టికి తీసుకెళితే, విజయసాయరెడ్డికి, వైసీపీకి ఎందుకంతభయం? ప్రభుత్వంలోని వారు ఎందుకు అంత పిచ్చిపిచ్చిగా  మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడిని టెర్రరిస్ట్ అని, హత్యలు చేయిస్తాడని, దుర్మార్గుడని బుద్ధి, జ్ఞానంలేకుండా విజయసాయిరెడ్డి మాట్లాడారు.

రాజకీయాల్లో పరిపాలనా విధానాలు బాగోలేనప్పుడు, ప్రజాస్వామ్యం అదుపుతప్పినప్పుడు ప్రతిపక్షాలు హెచ్చరించడమనేది సర్వసాధారణంగా జరిగేదే.  అంతమాత్రాన విమర్శించిన ప్రతిపక్షంపై నిందలు వేస్తారా? ఎక్కడో గుజరాత్ లో కొన్నిలక్షలకోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడితే, రాష్ట్రంలోని సత్యనారాయణపురం చిరునామా ఉంటే దానిపై  టీడీపీవారు మాట్లాడారు. అది ఎక్కడినుంచి వచ్చింది.. పోలీస్ శాఖ ఏంచేసిందని తాము ప్రశ్నిస్తే అదితప్పు అయ్యిందా?

రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న గంజాయి, దేశమంతా సరఫరా అవ్వడం, దానిపై అనేకరాష్ట్రాల పోలీస్ అధికారులు ఏపీ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపడం జరిగింది.  దానిపై ప్రభుత్వం మాట్లాడదు.. పోలీస్ శాఖ స్పందించదు.   మద్యం ధరలు విపరీతంగా పెంచడంవల్ల రాష్ట్రంలో చాలామంది గంజాయికి అలవాటుపడ్డారు. మరీముఖ్యంగా యువత బాగా దెబ్బతింటోంది.  దానివల్ల వారు మానసికంగా, శారీరకంగా బలహీనమవుతున్నారు. దానిపై ప్రతిపక్షం ప్రశ్నిస్తే, ప్రభుత్వం సద్విమర్శగా తీసుకోవాలి.   

చంద్రబాబునాయుడి ఇంటిపై వైసీపీ ఎమ్మె ల్యే దాడికివెళ్తే, దాన్ని ఈ ప్రభుత్వం, డీజీపీ సమర్థించారు.  అది మంచి పద్ధతేనా? ఎవరైతే దాడికివెళ్లారో, వారినెందుకు అరెస్ట్ చేయలేదు? ప్రభుత్వాన్ని విమర్శించారన్న అక్కసుతోనే మాజీ మంత్రులైన అచ్చెన్నాయుడు, కొల్లురవీంద్రలను అకారణంగా అరెస్ట్ చేసి, జైళ్లకు పంపారు. చింతమనేని ప్రభాకర్ పై దాదాపు 30వరక తప్పుడు కేసులుపెట్టారు. 

టీడీపీ జాతీయకార్యాలయంపై దాడి చేసి అక్కడి సిబ్బంది తలలు పగలగొట్టి, కాళ్లూ చేతులు విరగ్గొట్టారు. ఇవన్నీ చేస్తుంటే, రాష్ట్రంలో అరాచకాలు ప్రబలిపోతుంటే, బాధ్యతగల ప్రతి పక్షనేతగా చంద్రబాబునాయుడు గారు కేంద్రం దృష్టికి తీసుకెళ్లకూ డదా? టీడీపీప్రభుత్వం ఉన్నప్పుడు ఈ వైసీపీ వారు విమర్శలు చేయ లేదా? అప్పుడు మేం ఇలానే వ్యవహరించామా?

ఏపీప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు, ప్రతిపక్షాలకు రక్షణకల్పించడంలో విఫలమవ్వబట్టే, చంద్ర బాబునాయుడు కేంద్రపెద్దలను కలిసి, జరిగినవాటిని వారికి తెలి యచేయడానికి ఢిల్లీ వెళ్లారు. గతంలో టీడీపీప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉన్నప్పటికీ, రాష్ట్రానికి అన్యాయంజరుగుతోందని,  ఏపీ ప్రయోజనాలకోసం కేంద్రంతో విభేదించడం జరిగింది. విభజనహామీలపై కేంద్రంతో పోరాడాము. మరిప్పుడు అధికారంలోఉన్నవారు ఏం చే స్తున్నారు?

మొత్తం 28మంది ఎంపీలు ఉన్నాకూడా ఒక్కరోజైనా రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్రంతో మాట్లాడారా? రాష్ట్రానికి ఏమైనా ఒరగబెట్టారా?  కేవలం మీపై ఉన్న సీబీఐ, ఈడీ కేసులనుంచి బయటపడటానికి, భయపడుతూ బతుకుతున్నారు.  అలా కాదని కేంద్రం వద్ద  మీరు నోరు విప్పితే, మీ గుట్టురట్టవుతుంది.  రాష్ట్రం అన్నివిధాల దెబ్బతింటున్నా కూడా చోద్యంచూస్తున్నారు తప్ప, కేంద్రపెద్దల వద్ద నోరు తెరవడంలేదు.

పిరికితనంతో మీపై ఉన్నకేసులనుంచి బయటపడటానికి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు.  చంద్రబాబునాయుడిని టెర్రరిస్ట్ అని, పట్టాభిని చంపడానికి ఆయనే ప్రయత్నిస్తున్నాడని విజయసాయిరెడ్డి అంటున్నా డు. చంద్రబాబు అధికారంలోఉన్నప్పుడు రాష్ట్రంలో ఎక్కడా టెర్రరిజానికి, నక్సలిజానికి,  రౌడీయిజానికి తావులేకుండా చేశారు.  చంద్రబాబునాయుడు టెర్రరిస్ట్ అయితే, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో స్వేచ్ఛగా, పాదయాత్ర, ఓదార్పుయాత్ర చేయగలిగేవాడా?

అయినవారిని హత్యచేయించే సంప్రదాయానికి శ్రీకారంచుట్టింది జగన్మోహన్ రెడ్డి కాదా? వివేకానందరెడ్డిని హత్యచేయించింది ఎవరు? ఏ రాజకీయ ప్రయోజనాలకోసం ఆ పనిచేశారు? హత్యారాజకీయాలను టీడీపీ అసలు ప్రోత్సహించదు. పట్టాభి వ్యాఖ్యల్లోని అర్థం తెలుసుకోకుండా, ఆయనపై తప్పుడు కేసులుపెట్టారు. మీరు పెట్టినవి తప్పుడు కేసులుకాబట్టే, పట్టాభికి వెంటనే బెయిల్ వచ్చింది.

పట్టాభిని చంపాలనే ఆలోచనలు మీకున్నాయి...కానీ  ఆ నిందను టీడీపీపై వేయాలనిచూస్తున్నారా? దయచేసి హత్యారాజకీయాలకు స్వస్తి పలకండి. గతంలో మా నాయకుడిని ఉద్దేశించి, జగన్మోహన్ రెడ్డి చెప్పులతో కొట్టండి.. రాళ్లతో కొట్టండి.. అన్నాడు. మరిఅప్పుడు మేము ఏంచేయాలి? ప్రజాస్వామ్యంలో మాట్లాడేహక్కు ఉందని నమ్మాం కాబట్టే, దాన్ని మేం రక్షించాము. విజయసాయిరెడ్డికి చేతనైతే రాష్ట్రప్రయోజనాల  గురించి మాట్లాడాలి. చేతకాకపోతే, తనపని తాను చేసుకుంటే మంచిది. అంతే గానీ ప్రతిపక్షంపై, చంద్రబాబునాయుడిపై విమర్శలు చేస్తే ఎలా?  
 
చంద్రబాబునాయుడి ఢిల్లీ పర్యటనపై  విజయసాయి చేసిన వ్యాఖ్యలు, దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. ఢిల్లీలో కూర్చొని ఎదుటి వ్యక్తులపై బురదజల్లేలా మాట్లాడాడు. వారి అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే సాయిరెడ్డి అలా మాట్లాడాడు.  ఆఖరినిమిషంలో ముఖ్యమంత్రి ఢిల్లీపర్యటనలు ఎందుకు రద్దయ్యాయో సాయిరెడ్డికి తెలియదా? అనేకసార్లు ముఖ్యమంత్రికి, కేంద్రమంత్రులు ఎందుకు అపాయింట్  మెంట్ తిరస్కరించారో సాయిరెడ్డి ఎందుకు సమాధానం చెప్పడు?

పలుమార్లు సీఎం ఢిల్లీపర్యటనలు ఎందుకు వాయిదా పడ్డాయో, కేంద్రమంత్రుల అపాయింట్ మెంట్ లు ఎందుకు దొరకలేదో చెప్పాలి?  తనరెండున్నరేళ్ల పాలనలో, ఎప్పుడో అక్టోబర్ మొదటివారంలో 2020లో జగన్ రెడ్డి ప్రధానిని కలవడానికి వెళ్లారు. 22 మంది పార్లమెంట్ సభ్యలు, 6గురు రాజ్యసభసభ్యులను చేతిలోపెట్టుకొని రాష్ట్రానికి  ఏం ఒరగబెట్టారో చెప్పండి. ప్రధానమంత్రిని మీరెందుకు కలవలేకపోతున్నారు?

ఎందుకు ప్రధాని అపాయింట్ మెంట్ తీసుకోలేకపోతున్నారు? పోలవరానికి నిధులు తీసుకొచ్చే సామర్థ్యం మీకుందా? ఇవన్నీ ప్రశ్నిస్తే మావిబూతులా?  11 సీబీఐకేసులు, 8 ఈడీ కేసులున్న ఆర్థికఉగ్రవాది విజయసాయిరెడ్డి వద్ద తాము నడవడిక, హూందాతనం, మాట్లాడటం, నేర్చుకోవాలా? రాజ్యసభలో కూర్చొని ఆవలించడం తప్ప, రాష్ట్రానికి ఏ2 ఏంచేశాడు? ఏనాడైనా ప్రత్యేకహోదాపై మాట్లాడాడా? 

జూన్ నెలలో పోలవరానికి నిధులు వస్తున్నాయి అని ట్వీట్ పెట్టాడు.. ఇంతవరకు అతీగతీ లేదు. దానిపై విజయసాయిరెడ్డి ఏం చెబుతాడు? మాదకద్రవ్యాలపై మాట్లాడిన తెలంగాణ, తమిళనాడు, సేలం పోలీసులకు కూడా   నోటీసులిస్తారా? తాము టెర్రరిస్టులం అయితే, పట్టాభిఇంటిపై, టీడీపీ కార్యాలయంపై దాడిచేసిన వారు అహింసావాదులా?  13 జిల్లాల్లో మా పార్టీ కార్యాలయాలపై దాడిచేసిన వారంతా స్వాతంత్ర్య పోరాటంలో పనిచేసి వచ్చారా? దాడిచేసిన వారిని వదిలేసిన డీజీపీ, దాడికిగురైనవారికి నోటీసులిచ్చాడు.

మరిప్పుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై  డీజీపీ  ఇప్పుడు ఎవరికి నోటీసులు ఇస్తాడు? మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని టెర్రరిస్ట్ అంటే వదిలేయాలా? రాజ్యాంగపదవుల్లో ఉన్నవారిని విమర్శించకూడదా? మరి చంద్రబాబునాయుడు రాజ్యాంగబద్ద పదవిలో లేరా?  ప్రధానప్రతిపక్షంగా ఉన్న తాము ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపకూడదా?

ముఖ్యమంత్రిని ఏదో అన్నారంటూ  గొంతు చించుకుంటున్నారు, మరి రాజధానికి వేలఎకరాల భూములిచ్చిన అమరావతి రైతులు, మహిళలను ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీఎమ్మెల్యేలు దూషించినప్పుడు వారికి కోపం రాదా? వారికి బీపీలు పెరగవా? 22 మంది లోక్ సభ, 6 గురురాజ్యసభ సభ్యులను చేతిలో ఉంచుకొని, ఎందుకు ప్రభుత్వపెద్దలు ప్రధానిని కలవడంలేదు? ప్రత్యేకహోదా, పోలవరానికి నిధులు సాధించకుండా, ఢిల్లీలో కూర్చొని గడ్డి పీకుతున్నారా?

రాష్ట్రానికి రావాల్సిన వాటిపై ప్రతిపక్షం ప్రశ్నించకూడదా.. ప్రశ్నిస్తే బూతులు తిడతారా?  టీఆర్ ఎస్ ప్లీనరీలో కేసీఆర్ ఆంధ్రాలో కరెంట్ లేదంటే బూతుల మంత్రులు ఎవరూ నోరుతెరవలేదు? హైదరాబాద్ లోని తమ ఆస్తులను కాపాడుకోవడానికే ఏపీ మంత్రుల నోళ్లకు తాళాలు పడ్డాయా?  బిర్యానీ మీటింగులు జరపడం, శాలువాలు కప్పడం అంతా దగ్గరుండి చేయించిన సాయిరెడ్డి, కేసీఆర్ వ్యాఖ్యలపై నోరెత్తడేం?

విజయసాయి.. ఢిల్లీలో కూర్చొని  శ్రీరంగనీతులు చెప్పడంకాదు? దమ్ముంటే ప్రధానిని కలిసి, ఏపీ ప్రయోజనాలపై మాట్లాడు.   సాయిరెడ్డి, జగన్ రెడ్డి, ప్రధానిని కలవడా నికి ఎందుకు భయపడుతున్నారు? కేసుల మాఫీకోసం ఎందుకు ఆరాటపడుతున్నారు? వారికి రాష్ట్రప్రయోజనాలు ముఖ్యమా... లేక కేసుల మాఫీ ముఖ్యమా? 

కేంద్రహోంమంత్రి  ఢిల్లీకి రమ్మనగానే జగన్మోహన్ రెడ్డి కాలు బెణికిందా? వేలకిలోమీటర్లు పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి కాలు, అప్పటి కప్పుడు, ఢిల్లీలో సమావేశానికి రమ్మనగానే బెణకడమేంటి? ఏ ఆధారాలతో సాయిరెడ్డి ఢిల్లీలో నోటికొచ్చినట్లు మాట్లాడాడు? ఏం ఆధారాలున్నాయని జగన్ రెడ్డి ఆయనతో నోటికొచ్చినట్టు మాట్లా డించాడు?