నెల్లూరులో వైకాపా రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గృహనిర్భందం
నెల్లూరు జిల్లా రూరల్ ఎమ్మల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. జిల్లాలోని పొట్టేపాళెం కలుజు వద్ద వంతెన నిర్మించాలన్న డిమాండ్‌తో ఆయన గురువారం జలదీక్షకు చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆయన వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు వచ్చి ఆయన్ను అడ్డుకుని ఇంట్లోనే గృహ నిర్బంధించారు. పైగా, నిరసన దీక్షకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. దీంతో పోలీసుల తీరుకు నిరసనగా ఆయన ఇంటివద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.
కలుజు వద్ద వంతెనను నిర్మించాలని కోరుతూ నెల్లూరులోని మాగుంట లేఔట్‌లోని తన నివాసం నుంచి ఆయన బయటకురాగా పోలీసులు అడ్డుకున్నారు. నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. పోలీసుల తీరుపై మండిపడిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటి వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు, మద్దతుదారులు భారీ ఎత్తున తరలి రావడంతో ఉక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు.