బుధవారం, 9 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 5 ఏప్రియల్ 2023 (13:08 IST)

మీకెంత ధైర్యం.. నాపై పోస్టులు పెట్టిన వాడిని ఖాకీలు కొడితే మీరెళ్లి పరామర్శిస్తారా? నేతలపై వైకాపా ఎమ్మెల్యే ఫైర్

sanjeeviah
మీకెంత ధైర్యం లేకుంటే.. సోషల్ మీడియాలో నాకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వాడిని పోలీసులు కొడితే.. వాడిని మీరెళ్లి పరామర్శిస్తారా అంటూ తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య సొంత వైకాపా పార్టీ నేతలపై మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
వైకాపా సానుభూతిపరుడైన మంగపల్లి జ్యోతిష్‌ కుమార్‌ రెడ్డి (బాబురెడ్డి) సూళ్లూరుపేట మున్సిపాలిటీలో కాంట్రాక్టు విధానంలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడిని ఇటీవల ఉద్యోగంలో నుంచి తొలగించడంతో వైకాపా ప్రభుత్వ తీరును నిరసిస్తూ వాట్సప్‌లో ఓ మెసేజ్ పెట్టాడు. ఇది బాగా వైరల్ అయింది. ఎమ్మెల్యే సంజీవయ్య ఆదేశం మేరకు స్థానిక సీఐ వెంకటేశ్వర రెడ్డి, ఎస్ఐ మనోజ్‌కుమార్‌లు సోమవారం బాబురెడ్డిని పోలీసుస్టేషన్‌కు పిలిపించి, తీవ్రంగా కొట్టారనేది అభియోగం.
 
బాధితుడు తన ఒంటిపై గాయాల చిత్రాలను మీడియాకు విడుదల చేశారు. ఇదీ వైరల్‌ కావడంతో స్థానిక వైకాపా నాయకులు మంగళవారం చెంగాళమ్మ ఆలయానికి బాధితుడిని పిలిపించి మాట్లాడారు. సీఐకి ఫోన్‌ చేసి చెప్పినా బాబురెడ్డిని కొట్టడంపై ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ దువ్వూరు బాలచంద్రారెడ్డి, పురపాలక ఛైర్మన్‌ దబ్బల శ్రీమంత్‌రెడ్డి తదితరులు మండిపడ్డారు. కొద్దిసేపటికి వీరి వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే సంజీవయ్య.. బాబురెడ్డికి మద్దతుగా నిలవడం ఏమిటని తమ పార్టీ నాయకులపై మండిపడ్డారు.
 
పైగా, 'నాపై వాట్సప్‌లో మెసేజ్‌లు పెడితే ఖండించాల్సింది పోయి, సదరు వ్యక్తికి మద్దతుగా మాట్లాడతారా? అతనికి ఉద్యోగం ఇప్పించిందే నేను. తిరిగి నాపైనే పోస్టులు పెడితే కోపం రాదా? పోలీసులు కొట్టారని అతన్ని పరామర్శిస్తారా?' అని సొంత పార్టీ నాయకులపై సూళ్లూరుపేట వైకాపా ఎమ్మెల్యే సంజీవయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు, నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.