శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 31 జులై 2020 (18:20 IST)

తడి గుడ్డతో గొంతు కోయడమంటే ఇదే... : వైకాపా ఎంపీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్రవేశారు. అలాగే, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లుకు కూడా ఆయన సమ్మతం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఏపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దీనిపై అధికార వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందించారు. 
 
రాజధాని ప్రజలను నమ్మించి మోసం చేశారని రఘురామకృష్ణరాజు విమర్శించారు. ఇది ప్రభుత్వం చేసిన నమ్మక ద్రోహం, నయవంచన, తడి గుడ్డతో గొంతు కోయడమని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మూడు రాజధానులనేదే మోసమని, ఒకటే రాజధాని అని.. ఇక్కడ నుంచి తీసుకెళ్లి అక్కడ పెట్టుకున్నారన్నారు. 
 
న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందన్నారు. అమరావతి రైతులకు తోడుగా రాష్ట్ర ప్రజలందరూ ఏకమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. అమరావతి కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు ఎవరికీ లేదని రఘురామరాజు వ్యాఖ్యానించారు. 
 
అలాగే, టీడీపీ సీనియర్ నేత బొండా ఉమ స్పందించారు. ఈ రోజు రాష్ట్రానికి చీకటిరోజన్నారు. గతంలో రాజధాని అమరావతి అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకుని, అధికారంలోకి వచ్చాక మాట మార్చారని తప్పుబట్టారు. అప్పుడు ఒప్పుకుని.. ఇప్పుడు మూడు రాజధానులని ఎలా అంటారు? అని ప్రశ్నించారు. 
 
సీఎం జగన్ తన ప్రభుత్వాన్ని రద్దు చేసి, మూడు రాజధానుల అజెండాతో ప్రజల్లోకి వెళ్లి గెలవాలని సవాల్ విసిరారు. రాష్ట్ర విభజనానంతరం శాస్త్రీయబద్ధంగానే అమరావతి ఏర్పడిందని, అమరావతిలో దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. గవర్నర్‌ భిశ్వభూషన్‌కు తప్పుడు సూచనలిచ్చి.. బిల్లులు ఆమోదించేలా చేశారని బోండా ఉమా ఆరోపించారు. 
 
అదేవిధంగా మరో సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి స్పందిస్తూ, రాష్ట్రాన్ని బీజేపీ సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. చంద్రబాబు ఆహ్వానించినందుకే అమరావతి శంకుస్థాపనకు ప్రధాని వచ్చారని సోమువీర్రాజు అనడం దారుణమన్నారు. తిరుపతిలో ప్రధాని మోడీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని గోరంట్ల గుర్తుచేశారు.