శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 జులై 2020 (09:32 IST)

కరోనా బేఖాతర్ - 'జగనన్న పచ్చతోరణం'లో వైకాపా వైరస్ పాజిటివ్ నేత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన నేతలు అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నారు. కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం వణికిపోతుంటే... వైకాపా నేతలు బేఖాతర్ అంటూ నడుచుకుంటున్నారు. ఫలితంగా ప్రభుత్వ అధికారులు, ప్రజలు గుండెలు బాదుకుంటున్నారు. తాజాగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో కరోనా వైరస్ సోకిన వైకాపా నేత... 'జగనన్న పచ్చతోరణం' కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో అధికార యంత్రాంగం హడలిపోయింది. ఈ విషయం కలెక్టరుకు తెలియడంతో ఆ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులందరినీ 14 రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా ఆదేశించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అనంతపురం జిల్లా రాయదుర్గంలో 'జగనన్న పచ్చతోరణం' కార్యక్రమాన్ని బుధవారం వైసీపీ నేతలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డితో పాటు వైసీపీ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గౌని ఉపేందర్‌ రెడ్డి పాల్గొన్నారు. 
 
అయితే ఇక్కడే మిస్టరీ ఉంది. ఉపేందర్‌ రెడ్డికి ఈనెల 21నే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. హోం ఐసోలేషన్‌లో ఉండాల్సిన ఆయన... ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపేందర్‌ రెడ్డికి కరోనా సోకిన విషయాన్ని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అధికారులందరు 14 రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండాలంటూ కలెక్టర్ ఆదేశించారు.
 
కాగా, కరోనా విపత్కర పరిస్థితిలోనూ అధికార పార్టీ నేత వ్యవహరించిన తీరుపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే షుగర్, బీపీ, ఇతర అనారోగ్య సమస్యలతో కొంతమంది అధికారులు బాధపడుతున్నారు. 
 
ఇప్పుడు ఈ నేత వల్ల తమకెక్కడ కరోనా సోకుతుందోనని తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అధికారుల పరిస్థితి ఇలా ఉంటే ప్రజలు సదరు నేత తీరును దుమ్మెత్తిపోస్తున్నారు. అంతా తెలిసి కూడా అలా ఎలా చేస్తారని నిప్పులు చెరుగుతున్నారు.