శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. పర్యాటక రంగం
  3. ఏపీ టూరిజం
Written By Eswar
Last Modified: శనివారం, 9 ఆగస్టు 2014 (10:48 IST)

పర్యాటక తళుకుబెళుకుల్లో కృష్ణా జిల్లా

జిల్లాకు టూరిజం శోభ రాబోతోంది. విజయవాడ చుట్టు పక్కల ప్రాంతాల్లోని టూరిస్ట్ స్పాట్ లను అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వివిధ టూరిస్ట్ స్పాట్ లకు కొత్త లుక్ తెచ్చేందుకు సమాయత్తమవుతున్నారు.
 
కొండపల్లి ఖిల్లాపై రిసార్ట్స్...
కొండపల్లి ఖిల్లా, రెల్లిగడ్డిలంక, హంసలదీవి, మొవ్వ వేణుగోపాలస్వామి దేవాలయం, శ్రీకాకుళేంద్రస్వామి, మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, అవనిగడ్డ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం , భవానీ ద్వీపం, గాంధీకొండ ఇవన్నీ క్రిష్ణా జిల్లాలో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే ప్రాంతాలే. వీటన్నింటిని పర్యాటక కేంద్రాలుగా అభివ్రుద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి .కొండపల్లి ఖిల్లా లో పర్యాటకుల కోసం రిసార్ట్స్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో వుంది. ఇప్పటికే 47 లక్షల రూపాయలతో రాణిమహల్ , సమావేశ మందిరం ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. కింద నుంచి కోట పైకి రోప్ వే మార్గం ఏర్పాటు చేస్తున్నారు. కోట పైన తాగునీటి వసతి లేకపోవడం మైనస్ పాయింట్ గా మారడంతో ఆ సమస్యను తీర్చే ప్రయత్నాలు మొదలయ్యాయి.
 
700 ఎకరాల్లో విస్తరించిన రెల్లిగడ్డలంక ...
ఇబ్రహీంపట్నం ఫెర్రీ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో నది లోపలికి వెళ్తే రెల్లిగడ్డలంక ప్రాంతం వస్తుంది. దాదాపు 700 ఎకరాల్లో విస్తరించిన రెల్లిగడ్డి చూడముచ్చటగా వుంటుంది. ఇక్కడ కాటేజీలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. విజయవాడకు పది కిలోమీటర్ల దూరంలో వుండే ఈ ప్రాంతాన్ని పడవలో చేరుకోవడానికి చేసే ప్రయత్నం పర్యాటకులకు ఓ అందమైన అనుభూతే.
 
దివిసీమలోని ఆలయాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు...
ఆహ్లాదానికి చిరునామాగా నిలుస్తున్న దివిసీమను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కూచిపూడి నుంచి మొదలయ్యే దివిసీమలో మొవ్వ వేణుగోపాలస్వామి దేవాలయం, శ్రీకాకుళేంద్రస్వామి, మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, అవనిగడ్డ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం తో పాటు హంసలదీవి కూడా వుంది. వీటన్నింటినీ కలుపుతూ టూరిజం సర్క్యూట్ ను అభివ్రుద్ధి చేయాలన్నది అధికారుల ప్లాన్ . ఇందుకు 35 కోట్ల రూపాయలు అవసరమవుతాయన్నది అధికారుల అంచనా.
 
హంసలదీవి వద్ద కాటేజీల నిర్మాణానికి....
బంగాళాఖాతంలో కృష్ణా నది కలిసే హంసలదీవి గ్రామం దగ్గర వున్న సాగరసంగమం ప్రాంతంలో కాటేజీల నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. హంసలదీవిలో బోటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు. విజయవాడ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో వుండే హంసలదీవికి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయాలన్నది అధికారుల ప్లాన్. బాపట్ల దగ్గర వున్న సూర్యలంక బీచ్ మాదిరిగా బందరులోని మంగినపూడి బీచ్ ను తీర్చి దిద్దాలన్నది అధికారుల ప్లాన్. అయితే, ఈ స్థలం కోస్టల్ రెగ్యులేటరీ చట్టం పరిధిలో వుండడంతో కేంద్రం అనుమతి కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
 
భవానీ ద్వీపం నిర్వహణ తీరుపై విమర్శలు....
విజయవాడలోని భవానీద్వీపం సందర్శకులను విపరీతంగా ఆకర్షిస్తున్నప్పటికీ నిర్వహణ తీరుపై తీవ్ర విమర్శలున్నాయి. దీంతో 86 లక్షల రూపాయలతో ఆధునికీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. మరోవైపు భవానీద్వీపంలోని 20 ఎకరాల స్థలాన్ని శిల్పారామానికి అప్పగించారు. త్వరలో పనులు ప్రారంభంకాబోతున్నాయి.
 
గాంధీకొండపై వున్న ప్లానెటోరియం...
గాంధీకొండపై వున్న ప్లానెటోరియంను ఆధునికీకరిస్తున్నారు. బిర్లా సంస్థ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు కెమెరాలు, టెలీస్కోప్ కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ టూ టైర్ పార్కింగ్ సదుపాయం కల్పించబోతున్నారు. అధునాతన దీపాల ఏర్పాటు, యాంఫీ థియేటర్ ఆధునికీకరణ పనులతో కొత్త లుక్ తెచ్చేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.