హంసలదీవి గురించి ఇవి మీకు తెలుసా? గంగాదేవి అక్కడికి వచ్చి...
హంసలదీవి కృష్ణా జిల్లాలో విజయవాడకు 110 కి.మీ. అవనిగడ్డకు 25 కి.మీ. దూరంలో ఉంది. విజయవాడ నుంచి పామర్రు, కూచిపూడి, చల్లపల్లి, మోపిదేవి అవనిగడ్డ, కోడూరు మీదుగా ఈ ప్రదేశం చేరుకోవచ్చు. అలాగే మచిలీపట్నం నుంచి కూడా. అయితే ఈ ప్రాంతానికి బస్సు సౌకర్యం కొంచెం
హంసలదీవి కృష్ణా జిల్లాలో విజయవాడకు 110 కి.మీ. అవనిగడ్డకు 25 కి.మీ. దూరంలో ఉంది. విజయవాడ నుంచి పామర్రు, కూచిపూడి, చల్లపల్లి, మోపిదేవి అవనిగడ్డ, కోడూరు మీదుగా ఈ ప్రదేశం చేరుకోవచ్చు. అలాగే మచిలీపట్నం నుంచి కూడా. అయితే ఈ ప్రాంతానికి బస్సు సౌకర్యం కొంచెం తక్కువ. అవనిగడ్డ నుంచి హంసలదీవి దాకా బస్సులున్నాయి కానీ ఫ్రీక్వెన్సీ తక్కువ. దారి బాగుంటుంది. వెలుతురు ఉన్న సమయంలో వెళ్తే ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు.
పౌరాణిక విశేషాలు...
పూర్వం పాపాత్ములందరూ వెళ్లి గంగానదిలో స్నానం చేసి తమతమ పాపాలను పోగొట్టుకునేవాళ్లు. గంగానది పాపం వీళ్లందరి పాపాలతో అపవిత్రమైంది. ఆ పాపాలనుంచి విముక్తికై గంగాదేవి మహావిష్ణువుని ప్రార్ధించింది. అప్పుడాయన పాపాత్ముల పాపాల మూలంగా నువ్వు నల్లగా మారిపోయావు. అందుకని నువ్వు నల్లని కాకి రూపంలో వివిధ తీర్ధాలలో స్నానం చేస్తూ వుండు. ఏ తీర్ధంలో స్నానం చేసినప్పుడు నీ మాలిన్యం వదిలి హంసలా స్వచ్ఛంగా మారతావో అది దివ్య పుణ్యక్షేత్రం అని చెప్పాడు.
గంగ కాకి రూపంలో వివిధ తీర్థాలలో స్నానం చేస్తూ, కృష్ణవేణి సాగర సంగమ ప్రదేశంలో కూడా చేసింది. వెంటనే ఆమెకు కాకి రూపం నశించి హంస రూపం వచ్చింది. అందుకని ఆ ప్రాంతాన్ని హంసలదీవి అన్నారు. అక్కడ చాలామంది మహర్షులు, పరమహంసలు తపస్సు చేసుకుంటూ వుండేవారు. అందుకని కూడా హంసలదీవి అనే పేరు వచ్చిందంటారు. వాళ్లు అక్కడ యజ్ఞం చేయాలని శౌనకాది మహర్షులను ఆహ్వానించారు. వారందరూ వచ్చారు. ఆ యజ్ఞాన్ని చూడటానికి ప్రజలు ఎక్కడెక్కడినుండో రాసాగారు. గోదావరి తీరాన నివసించే కవశుడు అనే మహర్షికి కూడా ఆ యజ్ఞం చూడాలనిపించింది.
ఆయన బ్రాహ్మణ మహర్షికీ, శూద్రజాతి స్త్రీకి జన్మించినవాడు. గొప్ప తపస్సంపన్నుడు. అతడు అనేకమంది శిష్యులను వెంటబెట్టుకొని యజ్ఞం చూడటానికి వెళ్లాడు. వాళ్లు కవశ మహర్షిని చూడగానే వేద మంత్రోఛ్చారణ ఆపేసి కులభ్రష్టుడైన ఆయన రాకతో యజ్ఞవాటిక అపవిత్రమయినదని అనేక విధాలు దూషించి, అగౌరవపరచారు. కవశుని శిష్యులు కోపంతో వారించబోగా, కవశుడు వాళ్లని అడ్డుకొని, అక్కడి మునులకు క్షమాపణ చెప్పి, దేవతలు నిర్మించిన వేణుగోపాల స్వామి ఆలయం ముందు నిలచి విచారిస్తూ కృష్ణస్తోత్రాలు చేయటం మెుదలు పెట్టాడు. అప్పుడు జరిగిన విచిత్రమిది. నిర్మలంగా ప్రవహిస్తున్న కృష్ణానది ఒక్కసారిగా ఉప్పొంగింది.
ఇప్పటి పులిగడ్డ గ్రామానికి కొంచెం అవతల రెండు చీలికలయి ఒక చీలిక ఉధృతంగా బయల్దేరి కళ్లేపల్లి మీదుగా హంసలదీవి వచ్చి వేణుగోపాలస్వామి పాదాలను తాకి కవశ మహర్షి చుట్టూ తిరిగి యజ్ఞ వాటికను ముంచెత్తింది. యజ్ఞకుండాలు నీటితో నిండిపోయాయి. ఋత్విక్కులు నీటిలో కొట్టుకుపోయారు. భయంకరమైన ఈ అకాల ప్రళయానికి కారణం శౌనకాది మహర్షులు దివ్య దృష్టితో చూసి కవశ మహర్షికి జరిగిన అవమానం వల్ల ఇది జరిగిందని గ్రహించి కవశుని దగ్గరకు పరుగున వెళ్లి క్షమించమని వేడుకున్నారు.
ఆయన క్షమించటానికి నేనెవరిని నా అవమానం చెప్పుకొని కృష్ణుడి దగ్గర బాధపడ్డాను. దానికి ఆ దేవదేవుని పేరుతోనే ఉన్న ఈ నదీమ తల్లి వచ్చి నన్ను ఊరడించింది. మీరు ఆ కృష్ణుని, నదీమతల్లిని ప్రార్ధించండి అన్నాడు. తర్వాత వీరి ప్రార్ధనలు విన్న కృష్ణమ్మ శాంతించింది. కవశ మహర్షి కోరిక మీద అక్కడ సాగరంలో కలిసింది. అప్పుడు కవశ మహర్షి ఈ స్ధలం చాలా పవిత్రమైనది. ఎలాంటి పాపాలు చేసిన వాళ్లయినా ఈ సాగర సంగమంలో స్నానం చేసి ఇక్కడ వేణుగోపాల స్వామిని దర్శిస్తే పునీతులవుతారు అని చెప్తుండగానే ఒక కాకి ఆ సంగమంలో స్నానం చేసి హంసలా మారి వేణుగోపాలునికి ప్రదక్షిణలు చేసింది. ఇది చూసిన వారంతా అక్కడ స్నానం చేసి, వేణుగోపాలుని దర్శించి, కవశ మహర్షికి ప్రణమిల్లారు.