మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (11:50 IST)

ఓటరు చైతన్యం... పోలింగ్ కేంద్రాలకు తరలిన ఓటర్లు... ఏపీలో 76.69 శాతం పోలింగ్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చైతన్యం వెల్లివిరిసింది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. గంటలకొద్దీ క్యూలైన్లలో నిలబడి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా పోలింగ్ బూతుల బాట పట్టారు. ఈ పరిణామం దేనికి సంకేతం? ఈ తీర్పు ఎటువైపు మొగ్గు చూపబోతోంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది. గురువారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్.. పలు ప్రాంతాల్లో అర్థరాత్రి వరకు జరిగింది. 
 
సహజంగానే బలమైన సెంటిమెంట్ కలిగిన ఏపీ వాసులు తమ భవిష్యత్తుకు ఓటేశామని బహిరంగంగా చెప్పారు. క్యూలైన్లలో గంటలతరబడి నిలుచొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటు వేయనివాళ్లు సాయంత్రం తిరిగి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా పలు పోలింగ్ కేంద్రాల్లో వందల సంఖ్యలో ఓటర్లు బారులు తీరారు. రాత్రి 8 గంటలు దాటినా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేస్తునే ఉన్నారు. ఈ పరిణామాలు ఓటరు చైతన్యానికి నిదర్శనంగా నిలిచాయి.
 
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు మొత్తం 76.69 శాతం పోలింగ్‌ నమోదైంది. 2014లో 74.5 శాతం ఓటింగ్ నమోదైన విషయం తెల్సిందే. జిల్లాల వారీగా పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే, శ్రీకాకుళం 72, విజయనగరం 85, విశాఖపట్టణం 70, తూర్పుగోదావరి 81, పశ్చిమగోదావరి 70, కృష్ణా 79, గుంటూరు 80, ప్రకాశం 85, నెల్లూరు 75, కడప 70, కర్నూలు 73, అనంతపురం 78, చిత్తూరు 79 శాతం పోలింగ్‌ నమోదైనట్టు సమాచారం. అయితే, పోలింగ్ శాతం వివరాలను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సివుంది.