సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By కుమార్ దళవాయి
Last Modified: మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (18:27 IST)

ఫైనల్ పంచ్ వేసిన చంద్రబాబు... జగన్ పైన దిమ్మతిరిగే ఆరోపణ... నిజమేనా?

ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చివరి రోడ్‌షో తాడికొండలో జరిగింది. రాజధాని అమరావతి గురించి జగన్ కనీసం ప్రచారంలో చివరిరోజైనా ఒక్క మాట కూడా మాట్లాడలేదని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు మండిపడ్డారు. రాజధానిగా అమరావతి ఉండడం జగన్‌కు ఇష్టంలేదని, గెలిస్తే రాజధానిని మార్చేస్తానంటున్నారని మండిపడ్డారు. అమరావతిలో చాలామంది రైతులు స్వచ్ఛందంగా భూములిస్తే ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ అర్థంలేని విమర్శలు చేస్తున్నారని, ఇది జగన్ మూర్ఖత్వానికి నిదర్శనం అన్నారు.
 
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు కేసీఆర్‌ నిన్న మద్దతు ప్రకటించడంపై చంద్రబాబు స్పందిస్తూ, తెలంగాణ ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదాపై వ్యతిరేకంగా మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడు ఏ ఉద్దేశంతో ఈ ప్రకటన చేసారో ప్రజలకు తెలుసని చెప్పారు. పోలవరాన్ని ఆపివేయాలని కేసీఆర్ సుప్రీంకోర్టులో కేసులేశారని బాబు విమర్శించారు. తెలంగాణలో తాను ప్రచారం చేస్తే మీకేం పని ప్రశ్నించిన కేసీఆర్‌కు ఏపీలో ఇప్పుడేం పని అని నిలదీశారు.
 
కేసీఆర్‌, జగన్‌ మధ్య 1000 కోట్ల రూపాయల ఒప్పందం కుదిరిందని బాబు ఆరోపించారు. 1000 కోట్ల రూపాయలు తీసుకుని జగన్‌ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టబోతున్నారని విమర్శించారు. తాను అధికారంలో ఉంటే వచ్చే ఐదేళ్లలో అమరావతి అద్భుతంగా రూపుదిద్దుకుంటుందని, దీని వల్ల హైదరాబాద్ గ్రాఫ్‌ పడిపోతుందని భయపడుతున్నారని, అటువంటివారికి జగన్‌ సహకరిస్తున్నారని అన్నారు. 'ఈ ఐదేళ్లూ ఎవరికీ ఇబ్బంది లేకుండా పాలన సాగించాను. ఈ ఎన్నికల ప్రచారంలో ఇదే నా చివరి సభ. మీ ఆశీస్సులు కావాలి' అని కోరారు.